భూభారతి రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి. కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట, : రైతులు, భూ యజమానుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి దశలో వారికి సమాచారం అందించాలని స్పష్టం చేశారు.గురువారం మీరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామం, తొగుట మండలం చందాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న భూభారతి రీ-సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
లింగుపల్లిలో 186 ఎకరాలు.. చందాపూర్‌లో 50 ఎకరాల సర్వే పూర్తి
లింగుపల్లి గ్రామ పరిధిలో మొత్తం 556 ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 186 ఎకరాల సర్వే పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అదేవిధంగా చందాపూర్ గ్రామ పరిధిలో 780 ఎకరాలకు గాను 50 ఎకరాల భూమి సర్వే పూర్తయినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ స్థలాలు, ఆబాది భూములు, చెరువులు, కుంటలు, నక్షా బాటల సర్వే పూర్తి చేసిన తర్వాతే పట్టా భూముల సర్వే చేపట్టాలని సూచించారు. పట్టా భూముల సర్వేకు కనీసం రెండు రోజుల ముందుగానే సంబంధిత రైతులు, భూ యజమానులకు సమాచారం అందించాలని జీపీఓలు, సర్వేయర్లను ఆదేశించారు. గ్రామంలో స్థానికంగా నివసించని భూ యజమానులకు సైతం ముందస్తు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సర్వే వివరాలు వెంటనే రైతులకు అందించాలి
భూ యజమానులు, రైతులు సర్వే ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని, ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సర్వే పూర్తయిన వెంటనే సంబంధిత భూమి కొలతలు, సర్వే వివరాలను తప్పనిసరిగా రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.ఒకే భూ యజమానికి ఒకే ప్రాంతంలో పలు సర్వే నంబర్లలో భూములు ఉన్నట్లయితే, భూభారతి చట్టం ప్రకారం సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఒకే సర్వే నంబర్ కేటాయించే విధానం ఉంటుందని తెలిపారు. భూభారతి రీ-సర్వే విజయవంతం కావడానికి రైతులు, భూ యజమానులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.భూముల కొనుగోలు విషయంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూమి కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా సర్వే చేయించుకొని హద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు.
సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో ఆయా మండలాల తహసీల్దార్లు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, భూ యజమానులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.