ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి*
నిడదవోలు మేజర్ న్యూస్
భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వర్షంలోనే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. తిమ్మరాజుపాలెం, కోటసత్తెమ్మ గుడి రోడ్డుతో పాటు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో మోకాల్లోతు వర్షపు నీటిలో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చొరవ చూపారు. తొలుత బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిన నీటిని పరిశీలించి, అక్కడ నీరు నిలబడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిడదవోలు-యర్నగూడెం ప్రధాన రహదారిపై నీటి నిల్వలను పర్యవేక్షించారు. పంట కాలువ నుండి నీరు రావడంతో కోటసత్తెమ్మ గుడి సమీపంలో నీరు నిల్వ ఉండడంతో వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం నుంచే అధికారులను అప్రమత్తం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. కంసాలిపాలెం-మాధవరం మధ్య నీటి ఉధృతి పెరిగిన నేపథ్యంలో.. తక్షణమే ఎమ్మార్వో, ఆర్డీవోలను రంగంలోకి దింపి ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రమాద హెచ్చరిక బోర్డులను, బారికేడ్లను ఏర్పాటు చేయించారు. అలాగే, భారీ వర్షాల ధాటికి పట్టణంలో అక్కడక్కడ విద్యుత్ తీగలు వేలాడుతున్నట్లు స్థానికులు తెలపడంతో మంత్రి దుర్గేష్ స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని కాల్దారి, నిడదవోలు బస్టాండ్ ప్రాంతాలు, తిమ్మరాజుపాలెం కల్వర్టు తెగడం వంటి సమస్యలు తలెత్తాయని తెలిపారు. గత పాలకులు అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం వల్లే ఈ సమస్యలు ఏర్పడ్డాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్టాండ్ వద్ద డ్రైన్ నిర్మాణం, తిమ్మరాజుపాలెం వద్ద కల్వర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని త్వరలోనే నిధులు మంజూరవుతాయని వెల్లడించారు. బస్టాండ్ డ్రైన్ సమస్యపై ఆర్టీసీ ఎండీతో, మున్సిపల్ శాఖతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. కంసాలిపాలెం వద్ద ఎర్రకాలువ ఉప్పొంగే పరిస్థితి ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టామని, అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకే తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నామని, డ్రైన్ల నిర్మాణానికి త్వరితగతిన అనుమతులు సాధించి నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామన్నారు. మాలకోడు చెరువు వద్ద ఎస్టీపీ ప్లాంట్ పనులు పూర్తయితే పట్టణంలో మురుగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు.ఆ దిశగా తాము పనులు శరవేగంగా చేస్తున్నామన్నారు.
ప్రజలు వాట్సాప్ ద్వారా తమ సమస్యలను తన దృష్టికి తెస్తున్నారని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ ఐక్యంగా పనిచేసి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.