మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి:
మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: నిత్యం నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు
అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్:
పరవాడ – సబ్బవరం ప్రధాన రహదారి ప్రయాణికులకు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రహదారి మరింత అధ్వానంగా మారి, ఎక్కడికక్కడ పెద్దపెద్ద గుంతలు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. ఏ గుంత ఎంత లోతు ఉందో తెలియక నిత్యం ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ మార్గంలో గుంతల తీవ్రత అధికంగా ఉండటంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. సాధారణ రోజుల్లోనే ఇబ్బందిగా ఉండే ఈ ప్రయాణం, ప్రస్తుత వర్షాలతో ప్రాణాంతకంగా మారింది. రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేకపోవడంతో ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోంది. దీనికితోడు భారీ వాహనాలు ఈ మార్గంలో నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో రహదారి పూర్తిగా ఛిద్రమైంది.
తక్షణమే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన నూతన రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు, వాహనదారులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి పనులు ప్రారంభమయ్యే వరకు కనీసం యుద్ధప్రాతిపదికన తాత్కాలికంగా గుంతలను పూడ్చాలని, రహదారి మరింతగా దెబ్బతినకుండా ఉండేందుకు భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా దారి మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.