సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్ జగన్ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ పనితీరుపై వస్తున్న విమర్శలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని జగన్ అన్నారు. ఎన్నికల సంఘం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై చర్చకు దారితీసిన పరిణామాల నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
అయితే, ఎన్నికల సంఘం మాత్రం అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు సాధారణమేనని, గత ఏడాది తీసుకున్న తుది నిర్ణయాలన్నీ ముగ్గురు సభ్యుల ఏకాభిప్రాయంతోనే జరిగాయని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టేందుకు పారదర్శకత, జవాబుదారీతనం, ఓటర్ల జాబితాపై స్పష్టత కీలకమని జగన్ పేర్కొన్నారు.