BREAKING
రేపు సాయంత్రానికి వినాయక నిమజ్జనం పూర్తి మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత ఢిల్లీ, పశ్చిమ యూపీకి ఆరెంజ్ అలర్ట్‌.. భారీ వర్షాల హెచ్చరిక రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలన 20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’! సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలపై స్పందించిన వైఎస్‌ జగన్‌ పారదర్శకత, జవాబుదారీతనం ఈసీ ప్రాథమిక బాధ్యత: జగన్‌ మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి సొసైటీ ద్వారా రైతులకు స్వల్ప కాలిక రుణాలు అందజేస్తాం ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అఘాయిత్యం, పోక్సో చట్టం కింద కేసు నమోదు నూతన గ్రంథాలయ భవనానికి భూమిపూజ.. మహేష్ కుమార్ గౌడ్.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి. నావికుల భద్రతపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆందోళన తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న ప్రజాస్వామ్య లోటును సృష్టించే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు

20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’!

Select Suryaa Now
20 ఎకరాల్లో రామగుండానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’!
 
-పేదలకు రూ.10 లక్షల ఆర్థిక చేయూతతో ప్రభుత్వమే నిర్మాణం
-రూ.1,200 కోట్లతో నగర అభివృద్ధి
-రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
 
సూర్య-గోదావరిఖని:
 
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో ‘ఇందిరమ్మ టవర్స్‌’ పేరుతో బహుళ అంతస్తుల గృహ సముదాయం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న తరహాలో ఈ టవర్లను నిర్మించనున్నట్లు చెప్పారు. శుక్రవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన పాలకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడి హోదాలో హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు మరో రూ.5 లక్షల రుణం ఇప్పించి, ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, సొంత ఇల్లు లేని అర్హులైన పేదలకు వాటిని అందజేస్తామని చెప్పారు. రామగుండం జెన్‌కో, ఫెర్టిలైజర్ సిటీ, ఎన్టీపీసీ టౌన్‌షిప్‌, గోదావరిఖని ప్రాంతాలు నాలుగు దశాబ్దాల క్రితమే ఆధునిక నివాస సముదాయాలుగా రూపుదిద్దుకున్నాయని రాజ్ ఠాకూర్ చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్‌ఆర్ నిధులు సుమారు రూ.2,000 కోట్లు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని ఆయన ఆరోపించారు. తనకు ముఖ్యమంత్రి, మంత్రులతో ఉన్న సంబంధాల ద్వారా వివిధ శాఖల నుంచి నగరానికి నిధులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ ద్వారా రూ.600 కోట్లు, ఇతర శాఖల ద్వారా మరో రూ.600 కోట్లతో భవిష్యత్తులో రామగుండాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మౌలిక వసతుల కోసం తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రూ.40 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జీఓ 76తో పాటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఖాళీ స్థలాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
----------
రూ.600 కోట్లకు పైగా పనులు పురోగతిలో..
 
సమావేశానికి అధ్యక్షత వహించిన నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, ఎల్‌ఆర్‌ఎస్‌, జనరల్ ఫండ్‌, సీఎస్‌ఆర్‌, డీఎంఎఫ్‌టీ తదితర నిధులతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. యూఐడీఎఫ్‌కు రూ.50 కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీకి రూ.100 కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్‌కు అసిస్టెన్స్ కింద రూ.20 కోట్లు, యూఐడీఎఫ్ వాటర్ సప్లయ్ స్కీమ్‌కు రూ.88.90 కోట్లు, అమృత్‌ 2.0 కింద రూ.245 కోట్లతో నీటి సరఫరా మెరుగుదల పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
---------
అర్బన్ ఛాలెంజ్‌ ఫండ్‌తో భారీ ప్రణాళికలు
 
అర్బన్ ఛాలెంజ్‌ ఫండ్‌తో రామగుండం నగర రూపురేఖలు మారనున్నాయని మేయర్ తెలిపారు. రూ.120 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రూ.25 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, రూ.30 కోట్లతో 7.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌, రూ.135 కోట్లతో 55 ఎంఎల్‌డీ సామర్థ్యం గల వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌, రూ.152 కోట్లతో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌, డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అన్ని డివిజన్లలో ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టామని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని మేయర్ చెప్పారు.
--------
పోల్స్‌ వ్యవహారంపై విచారణ
 
గతంలో విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లు వేయకుండానే బిల్లులు చెల్లించారనే ఆరోపణలపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీర్లపల్లి గ్రామస్తుల కోసం ఎమ్మెల్యే సహకారంతో తొలిదశలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కాగా, సమావేశంలో మొత్తం 31 అంశాలను ప్రవేశపెట్టగా, నెలవారీ నీటి ఛార్జీలు పెంచే 20వ అంశాన్ని ముందుగానే పక్కనపెట్టి వాయిదా వేశారు. మిగిలిన అన్ని అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జె.అరుణశ్రీ, వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు.