telanagana
తాండూరులో గర్జించిన తీన్మార్ మల్లన్న
తాండూరు రెడ్డి నేతల చేతిలో బందీ అయిందంటూ వ్యాఖ్యలు
బీసీల రాజ్యాధికారమే లక్ష్యమని వెల్లడి
తాండూరు, మేజర్ న్యూస్, (సెప్టెంబర్ 25):బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించుకుని అసెంబ్లీకి పంపాలని ఆయన కోరారు.తన పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం తాండూరు పట్టణంలో తీన్మార్ మల్లన్న రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన కార్నర్ సభలో ఆయన మాట్లాడారు. తాండూరు నియోజకవర్గంలో బీసీల జనాభా అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.గత ఆరు దశాబ్దాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అగ్రవర్ణాలకు చెందిన నేతలే అధికంగా కొనసాగుతున్నారని మల్లన్న పేర్కొన్నారు. తాండూరులో గతంలో మర్రి చెన్నారెడ్డి, అనంతరం పలువురు బీసీ నాయకులు, ఆ తర్వాత మహేందర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, ప్రస్తుతం బుయ్యని మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఆయన ప్రస్తావించారు.తాండూరులో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ కుట్రలు, కుతంత్రాల కారణంగా బీసీ నాయకులు గెలవలేకపోతున్నారని మల్లన్న ఆరోపించారు. తాండూరు ప్రాంతంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రజల సమస్యలపై పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.బీసీలను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లి రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చిన మల్లన్న, వచ్చే ఎన్నికల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.విలేకరి రామ్ చందర్