telanagana
గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి
ఊమ్మెడ బ్రిడ్జి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :
గణేష్ నిమజ్జనం సందర్భంగా నందిపేట్ మండలం ఊమ్మెడ బ్రిడ్జి వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గోదావరి నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా భారీ గణేష్ విగ్రహాలను గోదావరి నీటిలో నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు , భక్తులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎవరూ ప్రమాదకరంగా నీటిలోకి వెళ్లకుండా చూడాలని , పోలీస్ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు , సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అదేవిధంగా నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ మరియు ప్రజల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, కోరారు.ఈ సందర్భంలో భారీ వినాయకుల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , సిటిసి ఎసిపి రాజశేఖర్ , ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి , నందిపేట్ ఎస్సై ఎన్. వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.