హిందూ మున్నాని నేత శశికుమార్ హత్య కేసులో తీర్పు.. నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్టు
సూర్య క్రైమ్ డెస్క్: తమిళనాడు కోయంబత్తూరులో సంచలనం సృష్టించిన హిందూ మున్నాని అధికార ప్రతినిధి సి శశికుమార్ హత్య కేసులో చెన్నై పూనమల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు చెందిన నలుగురు దోషులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దోషులుగా తేలిన వారిలో సద్దాం హుస్సేన్, సుబైర్, ముబారక్, మహమ్మద్ రఫీకుల్ హసన్ ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న అబూ అలియాస్ సయ్యద్ అబుతాహిర్‌ను తగిన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసింది.
సెప్టెంబర్ 2016లో కోయంబత్తూరు నగర శివార్లలో శశికుమార్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగులు వెంటాడి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు, భయాందోళనలు సృష్టించేందుకు పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ హత్య అనంతరం కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల్లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ సంచలన కేసులో విస్తృతంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు నలుగురిని దోషులుగా నిర్ధారించింది. కాగా ఒక నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని సమీక్షించి, పైకోర్టులో అప్పీల్ చేసే న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. సుదీర్ఘ విచారణ అనంతరం వెలువడిన ఈ తీర్పుతో తమిళనాడులో తీవ్ర సంచలనం నెలకొంది.