ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని, సాగు, తాగునీటితో పాటు విద్యుత్ రంగంలోనూ అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎప్పుడూ డైవర్షన్ డ్రామాలు ఆడుతుంటారని దుయ్యబట్టారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల పెద్దల ఆజ్ఞలను పాటిస్తూ ఇక్కడి నాణ్యమైన బొగ్గును ఆ రాష్ట్రాలకు తరలిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్‌పై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన యాష్ (బూడిద) అవసరాలను దృష్టిలో ఉంచుకునే దాన్ని దామరచర్లలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఎండిపోతున్న పొలాలు సీఎం రోజువారీ డ్రామాలతో పండవని, ఇప్పటికైనా అనవసరపు పనులు మాని పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు.
పాలిచ్చే ఆవులాంటి ట్రాన్స్‌కోను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఢిల్లీ, ముంబై, ఒడిశా వంటి ప్రాంతాల్లో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించిన చోట ప్రజలపై విపరీతమైన భారం పడిందని అన్నారు. కేసీఆర్ మీద ఎంత ఒత్తిడి ఉన్నా నాటి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేయలేదని, కానీ ప్రస్తుత సర్కార్ మాత్రం కమీషన్లకు ఆశపడి ట్రాన్స్‌కో లక్షల కోట్ల ఆస్తులను కారుచౌకగా అమ్మేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ట్రాన్స్‌కో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ప్రశ్నించిన అధికారులపై ఏసీబీ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుసరించే ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతుందని హెచ్చరించారు. నాటి సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణ చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చిందని కొనియాడారు. అసాధ్యమనుకున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను కొన్ని నెలల వ్యవధిలోనే అన్ని వర్గాలకు అందించిన ఘనత బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. కేవలం ట్రాన్స్‌కోపైనే రూ.36 వేల కోట్లు వెచ్చించి, ఎక్కడ విద్యుత్ సరఫరా నిలిచినా మరో మార్గం ద్వారా అనుసంధానించే అధునాతన గ్రిడ్ వ్యవస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.