రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
చౌటుప్పల్, మేజర్ న్యూస్:రైతుల సంక్షేమం, ఆర్థిక పురోగతికి నిరంతరం కృషి చేస్తామని చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్ అన్నారు. శనివారం చౌటుప్పల్ వలిగొండ రోడ్డులోని రైతు వేదిక వద్ద 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు యాదవ్, వైస్ చైర్మన్ పర్నే శివారెడ్డి, డైరెక్టర్ సురుకంటి లక్ష్మమ్మ యాదిరెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మస్తాన్ బాబు యాదవ్ మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో రైతుల సంక్షేమం, అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడమే సంఘం ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని గ్రామాలను పిల్లాయిపల్లి కాలువ ద్వారా సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాలువకు మరమ్మతులు చేయించి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టి భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించిన కౌన్సిలర్ కొసనం రాకేష్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్ కొరగోని లింగస్వామి, బండమీది మల్లేష్, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, దోనకొండ కృష్ణ, నల్ల గణేష్‌యాదవ్, ఉడత నరసింహ, బోరెం శేఖర్‌రెడ్డి, మారుపాకల స్వామి, మట్టపల్లి శ్రీశైలం తదితరులు, రైతులు పాల్గొన్నారు.