ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ
• సోషల్ మీడియా ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు
• పలు ప్రాంతాల్లో నమూనాల సేకరణ.. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తింపు
• ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
• దిద్దుబాటు చర్యలు నిర్దేశించిన ఏపీ పీసీబీ
• ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనంతరమే విడుదల చేయాలని ఆదేశం
• అక్రమంగా ప్రమాదకర వ్యర్థాల విడుదల చేస్తే నిబంధనల మేరకు చర్యలు
అనకాపల్లి ప్రతినిధి ,మేజర్ న్యూస్.
పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగుతో కూడిన నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తుందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్‌లో పోస్ట్ అయిన వీడియోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ పీసీబీ అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వీడియో ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు, ఆ పరిసరాల్లో దుర్వాసనకు కారణమైన ఆరోపణలపై వివరణ కోరుతూ ఫార్మాసిటీ పరిధిలోని అన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 95 కంపెనీలకు ఏపీపీసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
• వ్యర్థాల నిర్వహణ డిజిటలీకరణకు ఆదేశం
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులతోపాటు పలు దిద్దుబాటు చర్యలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఏపీపీసీబీ పరిశ్రమలకు ఆదేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు లేదా కలుషిత నీటిని పరిశ్రమల వెలుపలికి విడుదల చేయకుండా చూడాలని, ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ మానిటరింగ్ నిర్వహించడం, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచడం, కన్‌సెంట్ టు ఆపరేట్ (CTO), హాజర్డస్ వేస్ట్ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి చర్యలను కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
అక్రమంగా మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల వంటి వాటిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. పై చర్యలను వివరిస్తూ ఒక నివేదికను ఏపీపీసీబీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. ఈ సందర్భంగా ఈసీబీ అధికారులు మాట్లాడుతూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.