బీజేపీ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కేరళ మాజీ సీఎస్ జిజి థామ్సన్ సంచలన ఆరోపణలు
సూర్య నేషనల్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై కేరళ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జిజి థామ్సన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ నిర్వహణ మరియు ఎన్నికల కమిషన్‌లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించి మరో వివాదాస్పద విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన సర్వీసులో ఉన్న సమయంలో తనకు బీజేపీ తరఫున లోక్‌సభ టికెట్ ఆఫర్ చేశారంటూ జిజి థామ్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘ఆన్‌మనోరమ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలను బయటపెట్టారు.
విమాన ప్రయాణంలో బీజేపీ టికెట్ ఆఫర్: తాను కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో (2015–2016 మధ్య) ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తుండగా జ్ఞానేశ్ కుమార్ తనకు ఈ ఆఫర్ ఇచ్చారని జిజి థామ్సన్ వెల్లడించారు. "విమాన ప్రయాణంలో నాతో ఉన్న జ్ఞానేశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, కేరళలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను విపరీతంగా పొగిడారు. అంతటితో ఆగకుండా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘పతనంతిట్ట’ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉందా అని నన్ను అడిగారు. ఎన్నికల బరిలోకి దిగాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశారు. కానీ నేను ఆ ప్రతిపాదనను అక్కడికక్కడే తిరస్కరించాను" అని థామ్సన్ స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధ పదవిలో నిష్పాక్షికతపై ప్రశ్నలు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు నిష్పాక్షికంగా లేవని, బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయని ప్రతిపక్షాలు గతంలోనే ఆరోపించాయి. ఈ క్రమంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఇటీవల వెలువరించిన పరిశోధనాత్మక కథనం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు ఈసీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు రికార్డు అయ్యాయన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఇప్పుడు ఒకప్పటి సహచర ఐఏఎస్ అధికారి, కేరళ మాజీ సీఎస్ స్వయంగా రంగంలోకి వచ్చి నాటి నుంచే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ బహిరంగంగా ఆరోపించడం కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మార్చింది. కాగా, జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించడాన్ని తాను తొలినాళ్లలోనే వ్యతిరేకించానని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
జ్ఞానేశ్ కుమార్ ట్రాక్ రికార్డ్: 1988 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్ కుమార్, ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఫిబ్రవరి 2025లో ఆయన దేశం యొక్క 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేరళలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన అదూర్ సబ్-కలెక్టర్, ఎర్నాకులం జిల్లా కలెక్టర్, కొచ్చి కార్పొరేషన్ సెక్రటరీ, ఆర్థిక, పౌరసరఫరాలు, పీడబ్ల్యూడీ కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రపంచ బ్యాంకు నిధులతో కేరళలో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను పీడబ్ల్యూడీ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించారు. ఆ పరిణామాల తర్వాతే ఆయన కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ తాజా ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.