గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, శుభాకాంక్షలు
సూర్య జాతీయ డెస్క్: సిక్కు మత స్థాపకులైన శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా, విదేశాలలో ఉన్న ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, కరుణ, నిజాయితీతో కూడిన జీవనశైలి, మానవ సేవ వంటి గురునానక్ దేవ్ జీ శాశ్వత బోధనలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.
ఎక్స్ వేదికగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వదేశంలోనూ విదేశాల్లోనూ నివసిస్తున్న భారతీయులకు గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురునానక్ బోధించిన ఏక్ ఓంకార్ సందేశం మానవాళి ఐక్యత అనే ప్రాథమిక సూత్రాన్ని చాటిచెప్పిందని ఆమె పేర్కొన్నారు. కుల భేదాలు, సామాజిక అంతరాలు, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారని, ప్రేమ, కరుణ, మానవ సేవలే జీవితానికి పునాది కావాలని ఉద్బోధించారని గుర్తుచేశారు. నామ్ జపో, కిరత్ కరో, వండ్ ఛాకో అనే మూడు ప్రధాన సూత్రాలు భగవంతుని స్మరణ, కష్టార్జిత నిజాయితీ, సంపాదనను పంచుకోవడాన్ని ప్రోత్సహిస్తాయని తెలిపారు. లంగర్ సంప్రదాయం సామాజిక సమానత్వం, సౌభ్రాతృత్వం, నిస్వార్థ సేవను ఆచరణలో చూపిందని చెబుతూ, సేవ, సమానత్వం, సామరస్య విలువలతో సమాజ మరియు దేశాభివృద్ధికి పాటుపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురునానక్ దేవ్ జీ శాశ్వత బోధనలు మానవాళికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూనే ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దయ, ఐక్యత, సర్వజన హితం అనే పునాదులపై సమాజాన్ని నిర్మించుకోవడానికి ఆయన సందేశం మనందరికీ స్ఫూర్తినివ్వాలని ప్రధాని ఆకాంక్షించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ, కరుణ మరియు సామాజిక సామరస్య సందేశంతో మానవాళికి కొత్త మార్గం చూపిన ఆధ్యాత్మిక గురువు శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భగవంతునిపై విశ్వాసం, సదాచరణ మార్గాన్ని ప్రకాశవంతం చేయడంతో పాటు సోదరభావం, మహిళల పట్ల గౌరవంతో కూడిన వివక్ష రహిత సమాజాన్ని ఆయన ఆకాంక్షించారని పేర్కొన్నారు. లంగర్ సంప్రదాయం, ధర్మశాలల స్థాపన నిస్వార్థ సేవకు, సామాజిక సామరస్యానికి నిదర్శనాలని, సత్యం, దాతృత్వం, ప్రజా సంక్షేమ మార్గంలో నడవడానికి ఆయన బోధనలు రాబోయే తరాలకు సైతం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అమిత్ షా అన్నారు.