విశ్వంలోని తొలి తరం నక్షత్రాల రహస్యాలను దాచుకున్న అరుదైన నక్షత్ర శిలాజం గుర్తింపు
సూర్య జాతీయ డెస్క్: విశ్వంలో తొలి తరం నక్షత్రాల ఆనవాళ్లు, రసాయన స్వభావాన్ని పదిలపరుచుకున్న అరుదైన ప్రాచీన నక్షత్రం హెచ్ఈ 1153-0518ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహా విస్ఫోటనం జరిగిన కొన్ని వందల మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడిన తొలి తరం భారీ నక్షత్రాలు ఇప్పుడు లేకపోయినా, సూపర్నోవా పేలుళ్ల ద్వారా అవి విశ్వంలోని ఆదిమ వాయువుల్లో కొత్త మూలకాలను నింపాయి. ఆ వాయువుల నుంచి ఏర్పడిన ప్రాచీన, తక్కువ లోహాలు కలిగిన నక్షత్రాలు ఆ నాటి రసాయన ఆనవాళ్లను భద్రపరుచుకుని నక్షత్ర శిలాజాలుగా నిలుస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. వీటి అధ్యయనం ద్వారా విశ్వ ఆవిర్భావ తొలి దశ చరిత్రను పునర్నిర్మించడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు అసోంలోని దక్షిణ్ కామ్రూప్ కళాశాలకు చెందిన పరిశోధకుల బృందం ఈ నక్షత్రంపై లోతైన అధ్యయనం నిర్వహించింది. హవాయిలోని సుబారు టెలిస్కోప్ ద్వారా సేకరించిన అత్యున్నత స్పెక్ట్రోస్కోపిక్ డేటాతో పాటు తాజా ఖగోళ కొలతలను విశ్లేషించి ఈ నక్షత్ర వాతావరణ లక్షణాలు, మూలకాల సమృద్ధిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ పరిశోధనలో హెచ్ఈ 1153-0518ను కార్బన్ సమృద్ధ, తక్కువ లోహాలు కలిగిన నక్షత్రంగా వర్గీకరించారు. ఇందులో సూర్యుడితో పోలిస్తే సుమారు వెయ్యో వంతు ఇనుము మాత్రమే ఉన్నప్పటికీ, కార్బన్ మరియు సోడియం అధికంగా ఉండగా, న్యూట్రాన్ క్యాప్చర్ ప్రక్రియ ద్వారా ఏర్పడే భార మూలకాలు అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ నక్షత్రంలో కార్బన్ ఐసోటోపుల నిష్పత్తి తక్కువగా ఉండటం నక్షత్ర అంతర్భాగంలో గణనీయమైన మిశ్రమం జరిగినట్లు సూచిస్తోందని పరిశోధకులు తెలిపారు. దృశ్య మరియు పరారుణ తరంగదైర్ఘ్యాల్లో దీని శక్తి పంపిణీని పరిశీలించగా, పరారుణ ఉద్గారం అధికంగా కనిపించడం వల్ల నక్షత్రం చుట్టూ దుమ్ము మేఘాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 13 బిలియన్ సంవత్సరాలకు పైగా కాలం క్రితం జరిగిన కేంద్రక సంశ్లేషణ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ఇలాంటి ప్రాచీన నక్షత్రాలు కీలక ఆధారాలని అధ్యయన సహ రచయిత అరుణ గోస్వామి పేర్కొన్నారు. తొలి తరం నక్షత్రాలు విశ్వంలో మూలకాలను ఎలా వ్యాపింపజేశాయో, అవి తర్వాతి కాలంలో నక్షత్రాలు, గ్రహాలు, జీవరాశికి ఎలా పునాదిగా మారాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు.
ప్రయోగాత్మకంగా గుర్తించిన మూలకాల వివరాలను సిద్ధాంతపరమైన నమూనాలతో పోల్చి చూసినట్లు ప్రధాన రచయిత పార్థ ప్రతిమ్ గోస్వామి తెలిపారు. రసాయనికంగా ఆదిమ స్థితిలో ఉన్న ప్రతి కొత్త నక్షత్రం పాలపుంత తొలి చరిత్రను, తొలి నక్షత్రాల జీవన గమనాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ పరిశోధన వివరాలు మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సౌర కుటుంబం ఏర్పడటానికి ఎంతో ముందు కాలం నాటి విశ్వ చరిత్రను ఛేదించడంలో ఈ నక్షత్ర శిలాజాల అధ్యయనం మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని శాస్త్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.