బెంగాల్ కరువును ప్రస్తావించిన భారత్
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న సంఘర్షణల భారం అన్ని దేశాలపై సమానంగా పడదని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై దీని ప్రభావం అత్యధికంగా ఉంటోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, 1943 నాటి బెంగాల్ కరువును ఆయన భద్రతా మండలి సమావేశంలో ప్రస్తావించారు. కీలక ఇంధన మౌలిక సదుపాయాల పరిరక్షణ, నల్ల సముద్రం ద్వారా ప్రపంచ ఆహార సరఫరా మార్గాల రక్షణ అంశంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో భారత్ తన వైఖరిని బలంగా వినిపించింది. ప్రస్తుత అంతర్జాతీయ సంఘర్షణల వల్ల ఏర్పడుతున్న ఆహారం, ఇంధనం, ఎరువుల కొరతతో అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆ సంఘర్షణకు కారణం కాని ప్రజలు కూడా యుద్ధ ప్రభావానికి గురై అనూహ్యంగా నష్టపోయారని హరీశ్ పర్వతనేని గుర్తు చేశారు. 1943లో సంభవించిన ఘోర బెంగాల్ కరువులో 30 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దూర ప్రాంతాల్లోని యుద్ధ ప్రాధాన్యతలు, లెక్కల వల్ల ఎంతటి దారుణ మానవ నష్టం జరుగుతుందో ఆ ఘటన నిదర్శనమని పేర్కొన్నారు. ఐదో ఏట కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం అనుసంధానమైన ఈ ప్రపంచంలో ప్రతిచోటా కనిపిస్తోందని అన్నారు. ఇది యుద్ధాల యుగం కాదని, శాశ్వత యుద్ధం నుంచి యుద్ధం ముగిసే దిశగా ప్రపంచం పయనించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆయన పునరుద్ఘాటించారు. సంఘర్షణకు శాంతియుత పరిష్కారం దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
గ్లోబల్ సౌత్ దేశాలకు శాంతి అనేది కేవలం ఒక భావన కాదని, ఆకలితో ఉన్నవారికి అన్నం అందినప్పుడు, ఓడ రేవుకు సురక్షితంగా చేరినప్పుడు, నావికుడు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన శాంతి నెలకొంటుందని హరీశ్ పర్వతనేని వ్యాఖ్యానించారు. మానవతా సహాయ మార్గాలు, పౌర మౌలిక సదుపాయాల రక్షణ, సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా సంచారానికి భద్రతా మండలి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నల్ల సముద్ర ప్రాంతం, భారత్ కలిసి ప్రపంచ ధాన్యోత్పత్తిలో దాదాపు ఐదో వంతు వాటా కలిగి ఉన్నాయని, గోధుమ, మొక్కజొన్న, బార్లీ ఎగుమతుల్లో రష్యా, ఉక్రెయిన్ వాటా దాదాపు నాలుగో వంతు వరకు ఉందని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌కు గోధుమలు, సూడాన్‌కు బియ్యం, పాలస్తీనాకు మానవతా సహాయం అందించడం ద్వారా ప్రపంచ ఆహార సరఫరా గొలుసు పట్ల భారత్ తన నిబద్ధతను నిరూపించుకుందని తెలిపారు.
ప్రపంచ సంఘర్షణల్లో వాణిజ్య నౌకలు, వాటి సిబ్బందిపై దాడులు పెరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనల్లో భారత నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో సురక్షిత రాకపోకలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. సెప్టెంబర్‌లో ఐరాస ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా భారత్, లైబీరియా కలిసి షిప్పింగ్ మరియు నావికుల భద్రతపై స్నేహ బృందాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు గత ఏడాదితో పోలిస్తే మరింత విస్తృతంగా జరుగుతున్నాయని, నల్ల సముద్రంలో డ్రోన్ దాడుల వల్ల ఆహార ఎగుమతులకు ముప్పు వాటిల్లుతోందని ఐరాస రాజకీయ, శాంతి నిర్మాణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జనరల్ రోజ్మేరీ డికార్లో హెచ్చరించారు.
నల్ల సముద్రం ద్వారా ఆహార రవాణా గణనీయంగా తగ్గిందని, రష్యా, ఉక్రెయిన్లకు చెందిన సుమారు ఒక కోటి టన్నుల గోధుమలు ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లకు చేరకపోవచ్చని ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ల్యూక్ లిండ్బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు. 4.4 కోట్ల మందికి ఆహారం అందించగల ఈ నిల్వలు అందకపోతే తీవ్ర సంక్షోభం తలెత్తుతుందంటూ, ఇకపై కరువులు రాకుండా చూడటం, ఆహారాన్ని ఆయుధంగా వాడకపోవడం, మానవతా సహాయ సిబ్బందిపై దాడులు నిలిపివేయడం అనే మూడు అంశాలపై దేశాలు ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు శీతాకాలం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో విద్యుత్, అత్యవసర సేవలను పునరుద్ధరించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అడ్మినిస్ట్రేటర్ అలెగ్జాండర్ డి క్రూ తెలిపారు.