నేపాల్ కోషి ప్రావిన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం
సూర్య అంతర్జాతీయ డెస్క్: తూర్పు నేపాల్‌లోని కోషి ప్రావిన్స్‌లో చైనా సరిహద్దుకు సమీపంలో మంగళవారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల వల్ల తక్షణమే ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. నేపాల్‌లోని జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం వివరాల ప్రకారం, ఉదయం 7.17 గంటలకు ఈ భూకంపం నమోదైంది. ఖాట్మండుకు తూర్పున సుమారు 275 కిలోమీటర్ల దూరంలోని తాప్లేజుంగ్ జిల్లా ఓలంగ్‌చుంగ్ గోలా ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.
మరోవైపు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ భూకంప తీవ్రతను 5.3గా నమోదు చేసింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ సంస్థ వెల్లడించింది. తూర్పు నేపాల్‌లోని పలు జిల్లాలతో పాటు పొరుగు ప్రాంతాల్లోని ప్రజలు భూమి కంపించడాన్ని గమనించారు. ఉదయం వేళ ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు.
హిమాలయ పర్వత ప్రాంతం భూకంపాలకు సున్నితమైన జోన్‌లో ఉండటం వల్ల తరచూ ఇలాంటి ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. తాజా భూకంపం నేపథ్యంలో స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలు, పర్వత ప్రాంతాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో తలెత్తే స్వల్ప ప్రకంపనలు లేదా పరిణామాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.