ఇంధన సామర్థ్య చర్యలతో 120 బిలియన్ యూరోలు ఆదా
సూర్య బిజినెస్ డెస్క్: ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి అమలు చేసిన ఇంధన సామర్థ్య చర్యల వల్ల ఐరోపా సమాఖ్యకు గ్యాస్, చమురు దిగుమతుల ఖర్చుల్లో సుమారు 120 బిలియన్ యూరోలు ఆదా అయ్యాయని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 2022 నుంచి 2026 మధ్యకాలం వరకు ఈ పొదుపు నమోదైందని, 2015 నుంచి 2021 మధ్య కాలంలో తీసుకున్న ఇంధన సామర్థ్య విధానాలు, పెట్టుబడుల ఫలితంగానే ఈ స్థాయిలో ఖర్చులు తగ్గాయని కమిషన్ ప్రతినిధి అన్నా-కైసా ఇట్కోనెన్ తెలిపారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో విద్యుదీకరణ ప్రక్రియతో పాటు ఇంధన పొదుపు చర్యలు కూడా సమాంతరంగా కొనసాగాలని యూరోపియన్ కమిషన్ స్పష్టం చేసింది.
ఇంధన సామర్థ్య విధానాల ద్వారా సుమారు 195 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమాన ఇంధనం ఆదా అయినట్లు అంచనా వేశారు. 2024లో ఇటలీ, బెల్జియం దేశాల ఉమ్మడి స్థూల అంతర్గత ఇంధన వినియోగానికి ఇది దాదాపు సమానమని కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. ముందే చేపట్టిన చర్యల వల్ల కొత్త ఇంధన సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఐరోపాకు ఇంధన అవసరం తక్కువగా ఉందని, భవనాలు, పరిశ్రమల్లో గ్యాస్ వినియోగం తగ్గడం వల్ల సరఫరా అంతరాయాల ముప్పు కూడా తగ్గిందని అధికారులు వివరించారు. ఇంధన సామర్థ్య నిర్దేశం, భవనాల ఇంధన పనితీరు నిర్దేశం, పునరుత్పాదక ఇంధన నిర్దేశం వంటి నిబంధనలు ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.
జూలైలో ప్రవేశపెట్టిన ఐరోపా విద్యుదీకరణ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ప్రస్తుతం సుమారు 23 శాతం ఉన్న తుది ఇంధన వినియోగంలో విద్యుత్ వాటాను 2040 నాటికి 46 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధనాల వాటా దాదాపు 50 శాతానికి చేరువలో ఉన్నప్పటికీ, తుది ఇంధన వినియోగంలో విద్యుదీకరణ వాటా ఇంకా తక్కువ స్థాయిలోనే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. విద్యుదీకరణ విస్తరణ వల్ల శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు ఇంధన వ్యయాలు తగ్గి ఐరోపా పారిశ్రామిక పోటీతత్వం పెరుగుతుందని కమిషన్ భావిస్తోంది.
మరోవైపు రాబోయే ఇంధన సామర్థ్యం, ఇంధన లేబులింగ్ నిబంధనల అమలులో జాప్యం జరిగితే వాతావరణ, ఇంధన లక్ష్యాల సాధనకు ఇబ్బందులు తలెత్తుతాయని పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కేవలం విద్యుదీకరణ ఒక్కటే లక్ష్యాలను చేరుకోవడానికి సరిపోదని, ఇంధన సామర్థ్య చర్యలను బలోపేతం చేయడం అత్యవసరమని ఆయా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధన సరఫరా భద్రత, డిమాండ్ నియంత్రణ, సుస్థిర ఇంధన మార్పుల మధ్య సమతుల్యత సాధించడంపై ఐరోపా సమాఖ్య రాబోయే రోజుల్లో మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది.