రష్యాపై 22వ ఆంక్షల ప్యాకేజీ ప్రతిపాదించిన ఈయూ కమిషన్
సూర్య బిజినెస్ డెస్క్: రష్యాపై 22వ ఆంక్షల ప్యాకేజీని యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రతిపాదించింది. ఆర్థిక సంస్థలు, క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్‌లు, విద్యుత్ సంస్థలు మరియు రష్యా బీమా కలిగిన ట్యాంకర్ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఆంక్షలను రూపొందించినట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి కోసం రష్యా నిజమైన సంకల్పాన్ని చూపే వరకు కొత్త ఆంక్షలను ప్రతిపాదిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు.
క్రిప్టో ఆస్తుల ప్లాట్‌ఫారమ్‌లపై ఆంక్షలను రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని కమిషన్ నిర్ణయించింది. అలాగే రష్యాలోని కంపెనీల పాలక మండళ్లలో యూరోపియన్ పౌరులు కొనసాగడాన్ని నిషేధించడం, మాజీ రష్యా సైనికులు లేదా యోధులపై ప్రయాణ వీసా నిషేధాన్ని అమలు చేయడం వంటి అంశాలను ఈ ప్యాకేజీలో చేర్చారు. ఐరోపాలో రష్యా కార్యకర్తల కార్యకలాపాల నేపథ్యంలో మాజీ సైనికుల రాకపోకలు భద్రతా ముప్పుగా మారాయని, అందుకే ఈయూలోకి వారి ప్రవేశంపై ఆంక్షలు విధిస్తున్నామని వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు.
క్రీడలు మరియు సాంస్కృతిక రంగాలలో ప్రచార కార్యక్రమాలను అడ్డుకునే లక్ష్యంతో కఠిన చర్యలను ఈయూ ప్రతిపాదించింది. యూరోపియన్ యూనియన్ పరిధిలో జరిగే క్రీడా పోటీలలో రష్యా జట్లు మరియు అథ్లెట్లు రష్యా జెండా లేదా అధికారిక చిహ్నాలతో పోటీ చేయకుండా నిషేధం విధించాలని సూచించింది. రష్యా స్పాన్సర్ల నుంచి ఐరోపా క్రీడా, సాంస్కృతిక సంఘాలకు అందే ఆర్థిక ప్రవాహాలను పరిమితం చేయడంతో పాటు ఐరోపా క్రీడా సమాఖ్యల పాలక సంస్థలలో రష్యా పౌరులు పదవులు నిర్వహించడంపై ఆంక్షలు విధించనున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్‌కు శాంతి సాధించే బలాన్ని అందిస్తూ, శాంతి మార్గాన్ని ఎంచుకునేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. సభ్య దేశాల ఆమోదం అనంతరం ఈ కొత్త ఆంక్షల ప్యాకేజీ అమల్లోకి రానున్న నేపథ్యంలో, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన రవాణా మరియు క్రీడా రంగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.