సైనిక బలోపేతంలో జపాన్ వాహన సరఫరాదారుల కొత్త మలుపు
సూర్య బిజినెస్ డెస్క్: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ చేపడుతున్న అతిపెద్ద సైనిక బలోపేత ప్రణాళికల్లో దేశంలోని వాహన విడిభాగాల తయారీ సంస్థలను భాగస్వాములను చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. చైనా పోటీ నేపథ్యంలో జపాన్ ఆటోమొబైల్ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ, అనేక వాహన సరఫరా సంస్థలు రక్షణ సాంకేతికత వైపు దృష్టి సారిస్తున్నాయి. యోకోటేకు చెందిన తయారీ సంస్థ ఆస్టర్ గతంలో టయోటా వాహనాలకు విడిభాగాలు సరఫరా చేసేది, అయితే ఇటీవల ఈ రంగంలోకి ప్రవేశించి అమెరికా రక్షణ సాంకేతిక సంస్థ ఆండూరిల్ నిర్మించే డ్రోన్లకు ఎలక్ట్రిక్ మోటార్లను అందిస్తోంది. ఈ రక్షణ రంగ వ్యాపారం ఆ సంస్థ వార్షిక ఆదాయంలో ఇప్పటికే పదో వంతుకు చేరిందని, ఆటోమోటివ్ మోటార్ల కంటే డ్రోన్ల వ్యాపారం మరింత లాభదాయకంగా ఉందని సంస్థ సీఈవో టేకనోబు హోంగో పేర్కొన్నారు.
చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి అణ్వాయుధ పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి సనే తకైచి ప్రభుత్వం రక్షణ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. దేశంలోని పారిశ్రామిక సరఫరా గొలుసును వినియోగించుకోవడం ద్వారా భద్రతా మార్పులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు అమెరికా కూడా మిత్రదేశాల రక్షణ వ్యయాన్ని పెంచాలని ఒత్తిడి చేస్తోంది. మరోవైపు జపాన్ వాహన ఉత్పత్తి పదేళ్ల క్రితంతో పోలిస్తే 2025లో దాదాపు తొమ్మిది లక్షల యూనిట్లు తగ్గిన నేపథ్యంలో, విడిభాగాల సంస్థలకు రక్షణ రంగం కొత్త వ్యాపార అవకాశంగా మారుతోంది. రక్షణ కొనుగోళ్లను పర్యవేక్షించే అక్విజిషన్, టెక్నాలజీ అండ్ లాజిస్టిక్స్ ఏజెన్సీ ఆస్టర్ వంటి సంస్థలను అంచనా వేసి, రక్షణ సంస్థలతో అనుసంధానం చేస్తూ కొత్త నిధులను అందిస్తోంది. క్యాబినెట్ సలహాదారు కోకో కాటో కూడా వాహన విడిభాగాల సంస్థలు రక్షణ, ఇతర రంగాల్లోకి విస్తరించేందుకు ఉద్దేశించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యక్రమంలో మార్పులకు నేతృత్వం వహించారు.
ప్రస్తుతం జపాన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద వాహన తయారీ దేశంగా కొనసాగుతూ ఏటా 80 లక్షలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేస్తోంది, దాదాపు 70 వేల సంస్థలతో కూడిన ఈ రంగం ప్రతి పది ఉద్యోగాల్లో ఒకదానికి ఆధారంగా ఉంది. ఖచ్చితత్వం, ఎలక్ట్రానిక్స్ తయారీ, నాణ్యత నియంత్రణ వంటి నైపుణ్యాలు రక్షణ ఉత్పత్తుల తయారీకి ఎంతో ఉపయోగపడతాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కారు ఇంజిన్ విడిభాగాలు తయారు చేసే క్యోవా ఇండస్ట్రియల్ సంస్థ ప్రోటోటైప్ డ్రోన్ ఇంజిన్ల కోసం ఆర్డర్లు అందుకుంటోంది, ఈ సంస్థ వార్షిక విక్రయాల్లో రక్షణ రంగ వాటా గత ఏడాది వసంతకాలంలో 3 శాతంగా ఉండగా ఇప్పుడు 10 శాతానికి పెరిగింది. అమెరికా, ఐరోపా రక్షణ కాంట్రాక్టర్లకు విక్రయాలు జరిపే అవకాశాలను కూడా సంస్థలు పరిశీలిస్తుండగా, సెప్టెంబర్లో టోక్యోలో జరిగిన కార్యక్రమంలో 48 జపాన్ సంస్థలు పాల్గొన్నాయి.
అక్టోబర్లో కొత్త సైనిక సాంకేతికతల అభివృద్ధి, పరీక్షల కోసం నిధుల కార్యక్రమాన్ని ప్రారంభించిన రక్షణ కొనుగోలు సంస్థ, మానవరహిత వైమానిక వాహనాల విడిభాగాల తయారీలో వాహన సరఫరాదారులను ప్రోత్సహిస్తోంది. రేసింగ్ కార్ల విడిభాగాల తయారీ సంస్థ కాజ్ చిన్న గ్యాసోలిన్ ఆధారిత విమాన ఇంజిన్ను అభివృద్ధి చేయగా, టెర్రా డ్రోన్ సంస్థతో కలిసి పనిచేసే దిశగా సంప్రదింపులు జరుపుతోంది. ఓటాకు చెందిన ఇషికావా ఎనర్జీ రీసెర్చ్ వ్యవసాయ డ్రోన్లతో పాటు బరువైన రక్షణ సామగ్రి రవాణా, దీర్ఘశ్రేణి నిఘా కోసం ఉపయోగపడే డ్రోన్లపై దృష్టి పెట్టింది, వీటి విడిభాగాల్లో 50 శాతానికి పైగా సుబారు సరఫరా గొలుసు నుంచే సమకూరుతున్నాయి. అయితే టయోటా, హోండా, నిస్సాన్ వంటి అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థలు మాత్రం చైనాలో తమ వ్యాపార ప్రయోజనాలు, ప్రతిష్టాత్మక అంశాల దృష్ట్యా రక్షణ రంగంలోకి వెళ్లేందుకు ప్రస్తుతానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతోంది.