భారత్-నేపాల్ మధ్య 10 స్తంభాల ఉమ్మడి విజన్
సూర్య జాతీయ డెస్క్: ద్వైపాక్షిక సంబంధాలను ఆధునికీకరించి, పలు కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో భారత్ మరియు నేపాల్ వికసిత్ భారత్ మరియు సమున్నత్ నేపాల్ పేరుతో పది స్తంభాల ఉమ్మడి విజన్ పత్రాన్ని ఆమోదించాయి. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా నవంబర్ 22 నుంచి 23 వరకు భారత పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని, నేపాల్ ఆకాంక్ష అయిన సమున్నత్ నేపాల్‌ను సమన్వయం చేస్తూ యువతకు అవకాశాలు కల్పించడం, ఇరు దేశాల ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చడమే దీని ప్రధాన ఉద్దేశమని ఇరు దేశాలు స్పష్టం చేశాయి.
ఆర్థిక భాగస్వామ్యంలో భాగంగా నేపాల్‌కు భారత్ 15 వేల కోట్ల రూపాయల అభివృద్ధి సహాయాన్ని ప్రకటించింది. ఇందులో విపత్తు అనంతర పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 3,500 కోట్ల రూపాయల గ్రాంట్ సహాయం, ఇంధన రంగ ప్రాజెక్టుల కోసం రూపాయి ఆధారిత లైన్ ఆఫ్ క్రెడిట్ కింద 11,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. సరిహద్దు దాటి ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతి ఆధారిత పారిశ్రామిక పార్కులు, ఐటీ పార్కుల ఏర్పాటు అవకాశాలను పరిశీలించడంతో పాటు నేపాల్‌లోని ప్రాధాన్య రంగాలలో పెట్టుబడులు, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్ కృషి చేయనుంది.
రైలు, రోడ్డు, వాయు, డిజిటల్ అనుసంధానతను విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అయోధ్య-జనక్‌పూర్ మధ్య ప్రత్యక్ష ఎక్స్‌ప్రెస్ రైలు సేవల ప్రారంభం, భారత్‌లోని ధార్చులాను నేపాల్‌లోని దార్చులాతో కలిపే మహాకాళి నదిపై వాహనాల రాకపోకల వంతెన ప్రారంభోత్సవాలను నేతలు స్వాగతించారు. జయనగర్-బర్దిబాస్, జోగ్‌బాని-బిరాట్‌నగర్ రైలు మార్గాల వేగవంతంతో పాటు రక్సౌల్-కాఠ్‌మాండూ రైలు లింక్, నేపాల్ ఈస్ట్-వెస్ట్ రైల్వే నెట్‌వర్క్‌పై సహకారం అందించనున్నారు. సిలిగురి-ఝాపా పైప్‌లైన్ ద్వారా ఇంధన మౌలిక సదుపాయాల విస్తరణ, గ్యాస్ పైప్‌లైన్ అవకాశాల పరిశీలనతో పాటు యూపీఐ మరియు నేపాల్ జాతీయ చెల్లింపుల వ్యవస్థల అనుసంధానంతో సరిహద్దు రిటైల్ చెల్లింపులను వేగవంతం చేయాలని నిర్ణయించారు.
జలవిద్యుత్, ప్రసార మౌలిక సదుపాయాలు, విద్యుత్ వాణిజ్యం, పంచేశ్వర్, సప్తకోశి, సున్‌కోశి ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు, విపత్తు నిర్వహణ, హిమానీనద సరస్సుల పర్యవేక్షణలో సహకారాన్ని బలోపేతం చేయాలని తీర్మానించారు. కృత్రిమ మేధస్సులో భాషిణి సహకారంతో నేపాలీ భాషకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధి, కాఠ్‌మాండూలో స్టార్టప్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పోఖారాలో డిజిటల్ నోమాడ్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్, 5జీ, 6జీ టెలికాం మరియు ఉపగ్రహ రంగాలలో సహకారంపై దృష్టి సారించారు. అలాగే నేపాల్‌లో ఐఐటీ క్యాంపస్ వంటి ఉన్నత విద్యా సంస్థల శాఖల ఏర్పాటు, స్కాలర్‌షిప్‌లు, వృత్తి విద్యా శిక్షణ సంస్థ, నేషనల్ క్రికెట్ అకాడమీ, రామాయణ-బౌద్ధ-శివశక్తి పర్యాటక సర్క్యూట్లు, జన ఔషధి కేంద్రాలు, చిత్వాన్‌లో అగ్రో-ఇండస్ట్రియల్ పార్క్ వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటి అమలు పర్యవేక్షణ కోసం నేపాల్ విదేశాంగ కార్యదర్శి, భారత్ రాయబారి నేతృత్వంలో ఆరు నెలలకోసారి సమావేశమయ్యే ఉన్నత స్థాయి పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయగా, ఇది ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సహ అధ్యక్షతన పనిచేసే జాయింట్ కమిషన్‌కు నివేదిస్తుంది. తదుపరి జాయింట్ కమిషన్ సమావేశం 2027లో జరగనుంది.