మహిళా పారిశ్రామికవేత్తలపై సర్టిఫికెట్ కోర్సు విద్యార్థినులు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి..
మహిళా పారిశ్రామికవేత్తలపై సర్టిఫికెట్ కోర్సు
విద్యార్థినులు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి..
కడప మేజర్ న్యూస్
కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధిపై 30 రోజుల ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సు శుక్రవారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎస్. స్మిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళలు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయంగా వ్యాపారాలను ప్రారంభించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతోపాటు, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ సర్టిఫికెట్ కోర్సు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి. విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ కోర్సులో భాగంగా విద్యార్థినులకు స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యాపార ప్రణాళికల రూపకల్పన, మార్కెటింగ్ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే సమాజం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ పి. శచిదేవి, అర్థశాస్త్ర అధ్యాపకురాలు వి. మాలతి, విద్యార్థినులు పాల్గొన్నారు..