భారీ వర్షాల నేపథ్యంలో ముమ్మర భద్రతా చర్యలు
వరద ముంపు ప్రాంతాల్లో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
వడమ - అన్నవరం మధ్య సబ్ కలెక్టర్, డీఎస్పీ , ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాల పర్యటన
పాలకొండ, మేజర్ న్యూస్ గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను శుక్రవారం అధికారుల బృందం పరిశీలించింది. పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ డిఎస్పీ ఎం. రాంబాబు మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) ప్రత్యేక బృందం పాలకొండ మండలంలోని వడమ గ్రామం నుండి అన్నవరం గ్రామం వరకు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాయి. భారీ వర్షాలు, వరద ముప్పు దృష్ట్యా ప్రజల రక్షణ కోసం చేపట్టిన ముందస్తు భద్రతా ఏర్పాట్లను అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు. వడమ - అన్నవరం మార్గంలో ఉన్న కాజ్వేలను, నదీ ప్రవాహ వేగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, రాకపోకల భద్రతను సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు లేదా నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే సహాయక చర్యలు అందించేందుకు NDRF బృందాలు, స్థానిక యంత్రాంగం పూర్తి సన్నాహాలతో సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ రాద కృష్ణ మూర్తి, సి ఐ ప్రసాద రావు, ఎస్సై వెంకన్న రెవెన్యూ, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.