శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం, నవంబరు 23, మేజర్ న్యూస్:
ప్రజలకు ఇచ్చిన 160 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? మూడేళ్ల పాలనలో అభివృద్ధి కంటే దోపిడీపైనే దృష్టి పెట్టారు మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెబుతారు గుండ లక్ష్మీదేవిని మేయర్‌గా, వైఎస్సార్సీపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించండి - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
మేయర్ అభ్యర్థి శ్రీమతి గుండ లక్ష్మీదేవిని శ్రీకాకుళం మేయర్‌గా గెలిపించాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ప్రజలను కోరారు. వారితో పాటు 29వ డివిజన్ (పెయ్యలవానిపేట) అభ్యర్థి ఉంగరాడ ఉష, 35వ డివిజన్ (సీపన్నాయుడుపేట) అభ్యర్థి సీపాన సత్యవతి, 33వ డివిజన్ (ఫాజుల్‌బేగ్‌పేట) అభ్యర్థి నారాయణశెట్టి జ్యోతి, 23వ డివిజన్ (తోటపాలెం) అభ్యర్థి కల్లేపల్లి రమణకుమారి, 34వ డివిజన్ (పీఎన్ కాలనీ) అభ్యర్థి సీపాన సుధారాణి, 31వ డివిజన్ అభ్యర్థి ఎడ్ల లక్ష్మీ ఆయా డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ:
రాష్ట్రంలో పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది. అంత పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడడానికి కారణం ఏంటి? ఆనాడు ప్రజలకు ఉన్న సమస్యలపై హామీలు ఇచ్చారు. 160 హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ప్రజలు నమ్మడం లేదని గట్టిగా రంకెలు వేస్తూ చెప్పారు. ఒకసారి వెనక్కి వెళ్లి ఆయన మాటలు చూడండి. ఆయన ఎంత మోసగాడో మనకు అర్థమవుతుంది.
ప్రజలు ఆయనను నమ్మారు కాబట్టే ఓట్లు వేశారు. అధికారం వచ్చింది. అధికారం వచ్చిన మూడు నెలల్లోనే నేను ఏమీ చేయలేను అని చెప్పారు. పైగా వ్యతిరేకంగా చేశారా? పెన్షన్లను పీకడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడం, ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండటం, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ నీరుగార్చడం, విద్యార్థులకు ఫీజులు కట్టకుండా ఇబ్బందులు పెట్టడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడం.. ఆయన చెప్పిన ఒక్కటి కూడా జరగలేదు.
మూడు సంవత్సరాలు అయిపోయింది. మరో సంవత్సరం పోతే జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈరోజు వచ్చి గ్రామాల్లో ఇవన్నీ చేస్తామని చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇలా చెప్పడం టీడీపీకి అలవాటైపోయింది. డివిజన్ అభివృద్ధి చేయడానికి మేయర్‌కు నిధులు ఉంటే చాలు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వవలసిన పనిలేదు. మేయర్ అభ్యర్థి ఉంటే మన కార్పొరేషన్‌కు వచ్చే నిధులతోనే చాలా వీధుల్లో సమస్యలను మేయర్ పరిష్కరిస్తారు.
చంద్రబాబు డబ్బంతా ధనవంతులకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మూడు సంవత్సరాల్లో ప్రజలు కట్టిన తొమ్మిది లక్షల కోట్ల పన్నులు, మూడు లక్షల కోట్ల అప్పు మొత్తంగా 12 లక్షల కోట్లు రాష్ట్రానికి ఉంటే, కనీసం వంద కోట్లు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఖర్చుపెట్టలేదు. ఆ డబ్బంతా తీసుకెళ్లి ఒక గోతిలో రాజధాని కట్టేస్తున్నారు. అమరావతిలో వర్షం పడితే అదొక చెరువులా కనిపిస్తుంది. ఏమైనా అంటే ప్రపంచంలో ఇది గొప్ప రాజధాని, 2050కి పూర్తి చేస్తానని చెబుతున్నారు. నీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లు. నువ్వు ఇచ్చిన హామీలు ఐదు సంవత్సరాల్లో నెరవేర్చాలి. ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2050 చెబుతున్నావు. అప్పటికి ఇప్పుడు ఉన్నవాళ్లు ఎవరూ ఉండరు. చంద్రబాబుకు ఒక గొప్ప అలవాటు ఉంది. ఎప్పుడు గెలిచినా అప్పుడు పాతిక సంవత్సరాల అవతలికి చెప్పడం.
ఈ ప్రభుత్వం పరిపాలనలో ట్రాక్ తప్పిపోయి నాయకుల సొంత సంపాదనలో పడింది. ఈ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది మంది ప్రతినిధులు 80 సంవత్సరాలు పనిచేశారు. ఎవరూ ట్రాక్ తప్పలేదు. మేమందరం ఎంతో నిజాయితీగా పనిచేశాం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇసుక ఎత్తేస్తున్నాడు, వొక.. మట్టి అమ్మేస్తున్నాడు. కాంట్రాక్టు దగ్గర కమిషన్ కావాలి, లేఅవుట్ వేస్తే డబ్బులు కావాలి. ఇంత అన్యాయంగా వ్యవస్థలను దిగజార్చారు. చివరికి ఎమ్మెల్యే శంకర్ ఏ స్థాయికి వచ్చాడంటే, స్త్రీ అంటే దేవుడితో సమానంగా చూస్తాం. అమ్మంటే అంతకన్నా గొప్పగా చూస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న పద్ధతి ఏంటి? దేవుడి తరఫున పెట్టినటువంటి వ్యక్తి అమ్మని మనందరం నమ్ముతాం. అలాంటిది తల్లి వయసున్న మహిళ లక్ష్మీ దేవి నీ ముసలి నక్క అని అంటున్నాడు. వృద్ధాప్యం వచ్చిన ప్రతి తల్లి ముసలి నక్కా? స్త్రీలను ఎలా అలా అనొచ్చు? ఇది ఆయన సంస్కారం. ఆయన శాసనసభ్యుడు. ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఆయన తప్పు ఒప్పుకున్నంత వరకు మహిళలు ఎవరూ ఆయనకు ఓటు వేయకూడదు. లక్ష్మీదేవికి జనరల్ ఏజెంట్‌గా నేనే ఉంటాను. అవన్నీ ఎదుర్కోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. లక్ష్మీదేవిని మేయర్‌గా, మన అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించుకుందాం. మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వచ్చేస్తుంది. మరిన్ని నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.
రిపోర్టర్: రమేష్