అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి.....
వెల్దుర్తి, రూరల్ మేజర్ న్యూస్: గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించడమే తన ధ్యేయమని వెల్దుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో అవినీతికి తావులేని పాలన అందిస్తూ, ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచారు.
గత పాలనలో గ్రామానికి అభివృద్ధి పనులు …వెల్దుర్తి గ్రామంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కృష్ణగిరి రిజర్వాయర్ నుంచి రూ.3.20 కోట్ల వ్యయంతో తాగునీటి సౌకర్యం కల్పించి, ఇంటింటికీ కుళాయిల ద్వారా నీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణంతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని, కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులకు అనుకూలంగా అదనపు గదులను నిర్మించినట్లు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, ఆరోగ్య క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రజలకు సేవలను చేరువ చేసిందన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు.
గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం .…సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే వెల్దుర్తి పట్టణంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. డోన్ రైల్వే గేటు నుంచి బాలుర ఎస్సీ హాస్టల్ వరకు ప్రధాన రహదారి వెంబడి ఫోక్సింగ్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రివేళ ప్రయాణికులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు.
గ్రామపంచాయతీకి చెందిన విలువైన స్థలాల పరిరక్షణకు కృషి చేస్తాను...…గ్రామ పంచాయతీకి చెందిన విలువైన స్థలాలు ఆక్రమణలకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉపయోగపడేలా పార్కులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.వెల్దుర్తి గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు, అవినీతి రహిత పారదర్శక పాలన అందించేందుకు తనకు అవకాశం కల్పించి సర్పంచ్‌గా మరియు 16 మంది వార్డు మెంబర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెల్దుర్తి పట్టణ ప్రజలను బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి తన శిరసు వంచి ఓటర్లను అభ్యర్థిస్తున్నానన్నారు.