పంటకు నష్టం జరగకుండా చర్యలు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి:ఆర్నాబ్ తుఫాను నేపథ్యంలో పంట నష్టాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తూ, వారికి భరోసా కల్పించేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఆర్నాబ్ తుఫాను ప్రభావం, పంటల సంరక్షణ, నష్టం అంచనా, పునరుద్ధరణ చర్యలపై బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను పరిస్థితుల్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని, పంటలు, ధాన్యం నిల్వలు దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుల నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.
కోతకు సిద్ధంగా ఉన్న పంటలపై ప్రత్యేక దృష్టి
కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఇప్పటికే కోసిన పంటలు, పొలాల్లో ఉన్న ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు వర్షాలు, ఈదురుగాలుల కారణంగా దెబ్బతినకుండా రైతులకు ముందస్తు సూచనలు అందించాలని మంత్రి ఆదేశించారు. పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, కోసిన ధాన్యం తడవకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం, నిల్వలను భద్రపరచుకోవడం వంటి అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని చేరవేయాలని సూచించారు. వాతావరణం అనుకూలించిన వెంటనే వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పంటల సంరక్షణకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని స్పష్టం చేశారు.