పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో భద్రతా చర్యలు.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
వత్సవాయి మేజర్ న్యూస్ నవంబర్ 14: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని నాలుగు హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దేశపాలెం, మంగోలు, పెద్దమోదుగుపల్లి, గోపినేనిపాలెం గ్రామాల్లో డీసీపీ రూరల్, నందిగామ ఏసీపీ, జగ్గయ్యపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడటంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.అనంతరం మైక్ ద్వారా గ్రామ ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడటం చట్టరీత్యా నేరమని వివరించారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు, ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు.గ్రామాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా అవాంఛనీయ సంఘటనలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వత్సవాయి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.