health
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్, కొల్లూరు పరిసర ప్రాంతాల్లో నిర్మాణ ప్రాజెక్టుల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళిపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రాజెక్టుల్లో పర్యావరణ నిబంధనలు, వాయు కాలుష్య నియంత్రణ చర్యలు అమలవుతున్నాయా లేదా పరిశీలించేందుకు టిజిపిసిబి రోలింగ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ (నిరంతర సంచార తనిఖీ బృందాలు) ను ఏర్పాటు చేసింది. తనిఖీ బృందాలు ఈ నిర్మాణ ప్రాజెక్టులను తనిఖీ చేయగా, దుమ్ము, ధూళితో వాయు కాలుష్యం తీవ్రతరం అవుతున్నట్లు గుర్తించారు. నిర్మాణ ప్రాజెక్టుల కార్యకలాపాల్లో పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం (13 నవంబర్) నిర్వహించిన సమీక్షా సమావేశంలో 16 నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ నిబంధన అమలు తీరు పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షించింది. ఇందులో సంబంధిత రీజనల్ ఆఫీస్ అధికారులు, రోలింగ్ టాస్క్ ఫోర్స్ బృందాల అధికారులు, సిబ్బంది, ఆయా నిర్మాణ ప్రాజెక్టుల ప్రతినిధులు హాజరయ్యారు.
ఉల్లంఘనల తీవ్రతను పరిశీలించిన టాస్క్ ఫోర్స్ కమిటీ, తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన ప్రాజెక్టులకు మూసివేత ఉత్తర్వులు (క్లోజర్ ఆర్డర్) జారీ చేయడంతోపాటు, బ్యాంకు గ్యారెంటీలను జప్తు చేయాలని సిఫారసు చేసింది. స్వల్ప స్థాయి ఉల్లంఘనలు గుర్తించిన ప్రాజెక్టులకు కూడా బ్యాంకు గ్యారెంటీలు జప్తు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు సంబంధిత ప్రాజెక్టులకు 10 రోజుల గడువును కమిటీ సూచించింది.
పలు పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణ కార్యకలాపాలు – మూసివేతకు టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసు
నిర్మాణ ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు కాలుష్య నియంత్రణ మండలి నుంచి స్థాపనా అనుమతి (కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ మెంట్) పొందకుండానే నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించారు. వీటికి మూసివేత ఉత్తర్వులు (క్లోజర్ ఆర్డర్స్) జారీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది. టిజిపిసిబి గతంలో జారీ చేసిన నిర్మాణ కార్యకలాపాల నిలిపివేత ఉత్తర్వుల (ఆర్డర్స్ ఫర్ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్) ను బేఖాతరు చేస్తూ, టిజిపిసిబి నుంచి నిలిపివేత ఉత్తర్వుల ఉపసంహరణకు అనుమతి పొందకుండానే నిర్మాణ పనులు కొనసాగిస్తున్న మరో రెండు ప్రాజెక్టులకూ మూసివేత ఉత్తర్వులు (క్లోజర్ ఆర్డర్స్) జారీ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.
అలాగే, మరో నిర్మాణ ప్రాజెక్టుకు అనుబంధంగా పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసి) ప్లాంట్ టిజిపిసిబి నుంచి నిర్వహణా అనుమతి (కన్సెంట్ ఫర్ ఆపరేషన్) లేకపోవడంతో పాటు, తగిన కాలుష్య నియంత్రణ చర్యలు పాటించకపోవడం వల్ల వాయు కాలుష్యానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. ఈ ప్లాంట్ కార్యకలాపాలను కూడా మూసివేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసు చేసింది. ఈ దిశగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టనుంది.