అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా.. రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ రమేష్ గౌడ్ సవాల్.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రమేష్ గౌడ్.. అనంత వెంకటరెడ్డి జిల్లాకు ఏం చేశారో మీ సీనియర్లను అడగాలని హితవు.
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. అభివృద్ధిని పక్కన ఇంకా వైసీపీపై విమర్శలు చేయడం ఏంటని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను మేయర్ రమేష్ గౌడ్ ప్రశ్నించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతతో పాటు వైసీపీ నాయకులపై దగ్గుపాటి చేస్తున్న విమర్శల మీద ఆయన స్పందించారు. అనంతపురం నగరాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా అభివృద్ధిని పక్కన పెట్టి మీరేం చేశారో ప్రజలంతా చూశారన్నారు. అందుకే మాకు మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారన్నారు. 2019 నుండి 2024 వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నాయకత్వంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ఏకంగా రూ. 1,045 కోట్లతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. గుత్తి రోడ్డు విస్తరణకు రూ. 90 కోట్లు, బళ్లారి బైపాస్ నుండి పంగల్ రోడ్డు వరకు ఎన్ హెచ్-42 అనుసంధానానికి రూ. 311 కోట్లు, కేవలం 18 నెలల్లోనే టవర్ క్లాక్ నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం, నగరంలోని ప్రధాన రోడ్ల ఆధునీకరణకు రూ. 68 కోట్లు, కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు రూ. 49.50 కోట్లు, శిథిలావస్థలో ఉన్న సీడీ ఆస్పత్రి పునరుద్ధరణతో పాటు ఆరు వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం, అలాగే రాజీవ్ కాలనీ, రుద్రంపేట, నారాయణపురం వంటి విలీన ప్రాంతాలలో రూ. 121 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. నగరంలో రూ. 1,400 కోట్లతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆ పనులకు సంబంధించి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని మేయర్ రమేష్ గౌడ్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కూటమి అధికారంలోకి రాగానే రద్దు చేసి, మళ్లీ అవే పనులను తామే చేసినట్లు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. దశాబ్దాల కల అయిన అనంతపురం సర్వజనాస్పత్రి విస్తరణకు తాము రూ. 300 కోట్లతో శ్రీకారం చుడితే, నేడు ఆ పనులు ఎందుకు నిలిచిపోయాయో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టవర్ క్లాక్ రోడ్డు 2018లోనే మంజూరైందని ఎమ్మెల్యే చేస్తున్న వాదనలో వాస్తవం లేదని, ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. దివంగత నేత అనంత వెంకటరెడ్డి గారి విగ్రహం గురించి మాట్లాడే ముందు, అనంతపురం జిల్లాకు ఆయన చేసిన సేవలు ఏమిటో కూటమిలోనే ఉన్న సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్ ని కానీ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుని కానీ అడిగి తెలుసుకోవాలని మేయర్ హితవు పలికారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..