పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న సుమారు 600 మంది కార్మికులకు పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు జి. ఓబులు అన్నారు. కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని, 25 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ బకాయిలను జమ చేయాలని, ఈఎస్ఐ వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్‌కు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని సుమారు 900 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ఈ పథకంలో దాదాపు 600 మంది కార్మికులు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక ప్రజలకు తాగునీరు అందిస్తున్న కార్మికులకు పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
గతంలో అధికారుల సమక్షంలో అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్ వేతనాలన్నీ చెల్లిస్తామని యాజమాన్యం రాతపూర్వకంగా హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయలేదన్నారు. దీంతో చేసేది లేక నవంబర్ 7వ తేదీ నుంచి కార్మికులు విధులకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు. కార్మికులు కావాలని విధులకు దూరంగా ఉండటం లేదని, నెలల తరబడి వేతనాలు అందక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి వారిని ఈ నిర్ణయానికి నెట్టిందన్నారు.
కాంట్రాక్టర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ.. ఫేజ్–4లో పనిచేస్తున్న సుమారు 450 మంది కార్మికులకు గతంలో రూ.18,000 వరకు వేతనం అందేదని, ప్రస్తుతం కాంట్రాక్టర్ అప్పడాల వెంకటరాముడు హయాంలో కొంతమంది కార్మికులకు రూ.9,000 వరకు కోత విధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రూ.100 బాండ్ పేపర్లపై కార్మికులను భయపెట్టి సంతకాలు తీసుకున్నారని తెలిపారు. ట్రంక్‌లైన్ విభాగంలో సుమారు 110 మంది కార్మికులకు వేతనాలు, ఈపీఎఫ్ చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్ శివారెడ్డి హయాంలో అక్రమాలు జరిగాయని కార్మికులు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
కార్మికుల వేతనాల నుంచి ఈపీఎఫ్, ఈఎస్ఐ పేరుతో మినహాయించిన మొత్తాలు సంబంధిత ఖాతాల్లో జమ అవుతున్నాయా లేదా అనే విషయంపై అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. సంబంధిత ఇద్దరు కాంట్రాక్టర్ల గత కాంట్రాక్టుల నిర్వహణ, వేతన చెల్లింపులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ జమ వివరాలు, గతంలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఆధారాలతో నిర్ధారణ అయితే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం నోటీసులు ఇచ్చి, హామీలు తీసుకొని వదిలేయడం వల్ల కార్మికులకు న్యాయం జరగదన్నారు.
పథకంలోని 18 ఫిల్టర్ బెడ్లు సక్రమంగా పనిచేయడం లేదని, నీటి శుద్ధికి అవసరమైన అలమ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలు కూడా సరిపడా సరఫరా కావడం లేదని తెలిపారు. పని ప్రదేశాల్లో కార్మికులకు కనీస రక్షణ పరికరాలు, ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలని, దూర ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళ్లే కార్మికులకు ప్రయాణ, పెట్రోల్ ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి పథకం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రతి నెలా వేతనాలు, విద్యుత్ బిల్లులు, మరమ్మతులు, రసాయనాల సరఫరాకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. పథకాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగించాలని, కార్మికుల ఉద్యోగ, వేతన, సామాజిక భద్రతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులపై కక్షసాధింపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత కార్మిక శాఖ, ఈపీఎఫ్, ఈఎస్ఐ, తాగునీటి సరఫరా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏటీఎం నాగరాజు, యూనియన్ అధ్యక్షులు ఎర్రిస్వామి, ఉపాధ్యక్షులు వన్నూరు స్వామి, బోయ నాగరాజు, కొండారెడ్డి తదితరులతో పాటు గంగవరం, కళ్యాణదుర్గం, మడకశిర ప్రాంతాలకు చెందిన శ్రీరామ్ రెడ్డి పథకం కార్మికులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.