telangana
అర్హులందరికీ చేయూత పింఛన్లు - జిల్లా కలెక్టర్ కె. హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : కొమరం భీం జిల్లాలో అర్హులైన ప్రతి పేదవారికి చేయూత పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆసిఫాబాద్ మండలంలో అన్ని గ్రామపచాయతీలలోని లబ్ధిదారులకు ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి.అహ్మద్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కామ్డే అనిల్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిన్ అహ్మద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. చేయుత పించనుల కొరకు 9 వేల 466 దరఖాస్తులు రాగా 8 వేల 540 మంది దరఖాస్తుదారులు అర్హులుగా ఉన్నారని, మిగతా దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. చేయూత పించను పథకం అనేది సమాజంలోని అత్యంత బలహీనవర్గాలను రక్షించేందుకు ఉద్దేశించబడిందని, ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువ దరఖాస్తులు పింఛన్ల మంజూరు కొరకు వచ్చేవని, వాటి సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు మాట్లాడుతూ చేయూత పింఛన్ల మంజూరీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు వారికి ఎంతో ఆసరా ఉంటుందని, సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన రోజువారి కనీస అవసరాలకు ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరి మీద ఆధారపడకుండా పించను ద్వారా బ్రతికేందుకు దోహదపడుతుందని, చేయూత పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, డి పి ఎం రామకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వార్డు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.