పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
కడియం ,మేజర్ న్యూస్, పశుసంపద అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో మార్కెట్ కమిటీ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశువులకు ఉచిత గర్భధారణ పరీక్షలు నిర్వహించి, కాల్షియం, ఖనిజ లవణాల మిశ్రమం తదితర మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పశువులకు బీమా సదుపాయం, 50 శాతం రాయితీపై పశుదాణా, పశువుల షెడ్ల నిర్మాణానికి రాయితీపై మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశుగ్రాసం కొరత నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, పశుగ్రాసం సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.70 వేల వరకు ఆర్థిక సహాయం, ఉచిత విత్తనాలు, శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. సెక్స్ సార్టెడ్ సీమెన్ సాంకేతికతతో ఆడ దూడల ఉత్పత్తికి అవకాశం ఉందని, ఆధునిక పశువైద్య సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ మాట్లాడుతూ పాడి రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారని, పాడి పరిశ్రమ అభివృద్ధితో రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. పశువుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, డాక్టర్ జి. రవివర్మ, డాక్టర్ పి. వెంకటరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.