andhrapradesh
నికర ఆదాయం దిశగా రైతులకు ప్రోత్సహం
నగరం, మేజర్ న్యూస్:
తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నామని రేపల్లె వ్యవసాయ ఇంచార్జి సహాయ సంచాలకులు, స్థానిక మండల వ్యవసాయ అధికారి వి. రమేష్ బాబు అన్నారు. బుధవారం నగరం మండల పరిధిలోని పెద్దవరం, తోటపల్లి గ్రామ పంచాయితీలలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, వ్యవసాయ అనుబంధశాఖలతో కలిపి పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అనుబంధ శాఖల అధికారులు, రైతులతో కలిసి పొలాన్ని సందర్శించి, పంటల సాగుపై చర్చించి రైతులకు వ్యవసాయశాఖ పథకాలపై అవగాహన కల్పించారు. రబీ సీజన్ సాగులో అపరాల యాజమాన్య పద్ధతులు వివరించారు. వరి కోత సమయంలో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం అమ్మదలచినపుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ రబీ సీజన్ లో రైతులు స్వంతగా పంటలకు నామ మాత్రపు భీమ చేసుకోవాలని, పంటల భీమ పంటను బట్టి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మినుము, మొక్కజొన్న, జొన్న పంటలుకు ఈ నెల 15వ తేదీ ఆఖరు కాబట్టి భీమ చెల్లించిన పంటకి భీమ వర్తిస్తుందన్నారు. ఖరీఫ్ సీజన్లో పండిన వరి సాధారణ రకము క్వింటాల్ కి రూ.2441లు, 75 కేజి బస్తా రూ.1830.75లు, గ్రేడ్ 'ఎ ' రకము క్వింటాల్ రూ.2461లు, 75 కేజి బస్తా రూ.1845.75లు, వంతున అమ్ముకోవచ్చన్నారు. ఈ - పంట నమోదు చేసుకుని, ఈకేవైసీ పూర్తి అయిన రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఏవైనాసందేహాలుంటే రైతు సేవ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కె. నాగ శ్రీనివాసరావు, గ్రామ వ్యవసాయ సహాయకుడు ఏ. నాగ రమేష్, రైతులు పాల్గొన్నారు.