ఏపీలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి*
*సీఎం చంద్రబాబుతో జపాన్ రాయబారి కెయిచీ ఓనో భేటీ*
సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని భారత్‌లో జపాన్ రాయబారి కెయిచీ ఓనో వెల్లడించారు. రాష్ట్రంలో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన కెయిచీ ఓనో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కీలక ఖనిజాల సరఫరా, గ్రీన్ ఎనర్జీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే శ్రీసిటీలో పలు జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అక్కడి జపాన్ పారిశ్రామిక వర్గాలు, జపాన్ కమ్యూనిటీ గ్రూప్ ప్రస్తావించిన అంశాలను రాయబారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ప్రణాళిక చేసిన 20 సెక్టోరల్ ఇండస్ట్రియల్ పార్కుల్లో భాగంగా రెండో జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు మారుబెని, సుమిటోమో, మిత్సుయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
*రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం*
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక వాతావరణాన్ని కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా జపాన్ రాయబారికి వివరించారు. పరిశ్రమలకు అందించే రాయితీల విషయంలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ఎస్క్రో అకౌంట్ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమల స్థాపన, విస్తరణకు వేగంగా అనుమతులు, అవసరమైన సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు జపాన్ సంస్థలు సహకరించాలని కోరారు. జపాన్ కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందిస్తే అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించగలమని వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రతినిధులు ఏపీలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు జపాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్, భారీ యంత్రాల తయారీ సంస్థలైన సుజుకి, హోండా, కోమాట్సు, కవాసాకి, యమహా తదితర కంపెనీలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న షిప్ బిల్డింగ్ క్లస్టర్‌లో జపాన్ సంస్థలు పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని సీఎం కోరారు. మిత్సుబిషి, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, ఇమాబారి వంటి ప్రముఖ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ అంశాలతో పాటు జపాన్‌కు రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాను స్థిరంగా కొనసాగించే అంశాన్ని జపాన్ ప్రతినిధులు ప్రస్తావించారు. మరోవైపు ఏఎం, ఎన్‌ఎస్ ఇండియా ఉక్కు ప్లాంట్ తొలి దశ నిర్మాణానికి అవసరమైన పారిశ్రామిక నీరు, ఇతర మౌలిక వసతులను కల్పించాలని ప్రతినిధులు కోరారు. అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే అమార్ఫస్ మెటల్‌ను దేశంలో తొలిసారిగా తయారు చేయాలని ప్రొటీరియల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
*విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్*
భారతీయ నిపుణుల ప్రతిభను వినియోగించుకుంటూ, భారత్–జపాన్ సహకారంతో ఈ ఏడాది విశాఖపట్నంలో కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రారంభించినట్లు జపాన్ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను ఈ కేంద్రం మరింతగా వినియోగించుకోనుందని పేర్కొన్నారు. మరోవైపు ఐదేళ్ల పాటు ఏటా సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియా కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన జెరా సంస్థ, ఏఎం గ్రీన్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమావేశంలో వెల్లడించారు.