నేడు తేలనున్న పాములపాడు ఎంపీపీ పీఠం.. కొనసాగుతున్న ఉత్కంఠ
పాములపాడు: పాములపాడు మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠంపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 6 స్థానాలు, తెలుగుదేశం పార్టీ 5 స్థానాలు గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
అయితే స్వతంత్ర అభ్యర్థి ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఎంపీపీ ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికపై రెండు పార్టీల నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా, గురువారం నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ధరా సుధీర్ పాములపాడుకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు టీడీపీ నాయకులు సైతం ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో పాములపాడు మండల ఎంపీపీ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు జరిగే ఎన్నికలో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠకు తెరపడనుంది.