పరిగిలో ప్రైవేటు ఆసుపత్రిలో విషాదం.. వైద్యం వికటించి బాలిక మృతి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన మంగళి వైష్ణవి (16) అనే బాలిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వారం రోజుల క్రితం కడుపునొప్పితో బాధపడుతున్న వైష్ణవి పరిగిలోని ఛత్రాజీ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు అపెండిసైటిస్ ఉందని నిర్ధారించి ఆపరేషన్ చేశారు. అనంతరం బాలికను డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్లింది. అయితే మరుసటి రోజే తిరిగి అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ అదే ఆసుపత్రికి తీసుకెళ్లగా, నిమోనియా ఉందని, ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు.బాలిక పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తీసుకెళ్తామని చెప్పినప్పటికీ, ఇక్కడే మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు భరోసా ఇచ్చినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బాలిక పరిస్థితి విషమించడంతో చివరి నిమిషంలో హైదరాబాద్కు రిఫర్ చేశారని, అంతకుముందు కుటుంబ సభ్యుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వైష్ణవి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.తమ కుమార్తె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఛత్రాజీ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 16 ఏళ్ల బాలిక మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి చికిత్సకు సంబంధించిన వివరాలను పరిశీలించి, వైద్యపరమైన నిర్లక్ష్యం ఏమైనా జరిగిందా అనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రి యాజమాన్యం వివరణ, అధికారుల విచారణలో వెల్లడయ్యే వాస్తవాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.