మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్
రేణిగుంట మేజర్ న్యూస్: మురాసు తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. తుపాను నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు, చెరువులు, కాలువలకు గండ్లు, రహదారులపై చెట్లు కూలడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. తాగునీరు, నిత్యావసర సరుకుల సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 0877-2236007 నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, అధికారుల సూచనలు పాటించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.