మంత్రాలయంలో రాఘవ సరోవర ప్రాజెక్టుకు భూమిపూజ
మంత్రాలయం, సూర్య ప్రతినిధి మంత్రాలయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రాఘవ సరోవర ప్రాజెక్టుకు బుధవారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో, శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.మంత్రాలయంలోని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా పచ్చదనంతో కూడిన సుందరమైన కృత్రిమ సరస్సును నిర్మించడంతో పాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహన, ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ విచ్చేసి ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన శ్రీ మదన్ పాటిల్ రాఘవ సరోవర ప్రాజెక్టు నిర్మాణానికి రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు.కార్యక్రమానికి డాక్టర్ సి.ఎస్. మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు, దాతలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రాఘవ సరోవర ప్రాజెక్టు పూర్తయితే మంత్రాలయానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం అందుబాటులోకి రానుంది.
నల్లారెడ్డి సూర్య ప్రతినిధి మంత్రాలయం కర్నూలు జిల్లా