కులం పేరుతో దూషణలు, దాడులు, కుటుంబానికి ప్రాణహాని ఉందని కలెక్టర్ కు ఫిర్యాదు.
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జె. హరిప్రకాష్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజానాథ్, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. 30వ వార్డు కౌంటింగ్ సమయంలో కులం పేరుతో దూషణలు, దాడులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఘటనతో తమ కుటుంబ సభ్యుల ఆత్మగౌరవానికి భంగం కలగడంతో పాటు కుటుంబ భద్రతకు ముప్పు ఏర్పడిందని హరిప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే రాజ్యాంగబద్ధమైన హక్కులకు విఘాతం కలిగిందని వివరించారు. కౌంటింగ్ సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా కులం పేరుతో దూషించడం, దాడులు చేయడం, వేధింపులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం-1989తో పాటు వర్తించే ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీలు, వీడియో రికార్డింగులు, కౌంటింగ్‌కు సంబంధించిన పత్రాలు, అధికారుల నివేదికలను సేకరించి భద్రపరచాలని కోరారు. కౌంటింగ్ కేంద్రంలో జరిగినట్లు ఆరోపిస్తున్న దాడులు, బెదిరింపులు, ఎన్నికల ఏజెంట్ల విధులకు ఆటంకం కలిగించిన అంశాలపై స్వతంత్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, కౌంటింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపిస్తూ, ఈ అంశాలన్నింటినీ నిష్పక్షపాతంగా పరిశీలించిన అనంతరం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 30వ వార్డులో రీ పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఫిర్యాదుదారుడితో పాటు ఆయన భార్య, అన్న, ఇతర కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను అభ్యర్థించారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవన హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఒక దళిత కుటుంబానికి చెందిన మహిళ ఎన్నికల్లో పోటీ చేసినందుకు, ఆమె తరఫున కుటుంబ సభ్యులు కౌంటింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వహించినందుకు వేధింపులు, దాడులు ఎదుర్కోవాల్సి రావడం ఆందోళనకరమని వివరించారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షించడం అధికారుల బాధ్యతని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తలారి హర్ష, సాకె రుత్విక్, అడ్వకేట్ రామాంజినేయులు, పలువురు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ := బోయ రంగస్వామి.