నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం పొదలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు. భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో మాట్లాడి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, మధ్యాహ్నం 12 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా సగటున 40 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. తాను పరిశీలించిన పొదలకూరులోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో 38 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు వెల్లడించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు హాజరై ఉన్నారని, పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూల నివేదికలు అందలేదని స్పష్టం చేశారు. ఉదయం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసినప్పటికీ, ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉందని, వర్ష సూచనలు లేకపోవడంతో ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లందరికీ టోకెన్లు లేదా పాస్లు అందజేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత, తరలింపు కోసం జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసిందని కలెక్టర్ వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల నుంచి స్పందన గణనీయంగా పెరిగిందని, పోలింగ్ ముగిసే సమయానికి జిల్లాలో 60 నుంచి 65 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.