భవిష్యత్ జనసేనదే * ఎన్నికలేదైనా కూటమిదే విజయం *
శ్రీకాకుళం, సూర్య : సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన కొత్త తరం రాజకీయాన్ని తీసుకురావడమే జనసేన లక్ష్యమని భవిష్యత్ ఇక జనసేన పార్టీదేనని విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే, విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నగరంలోని కిమ్స్ ఆసుపత్రి రోడ్డులో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనసేన పార్టీ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేటుతో విజయం నమోదు చేసిందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించడం ఖాయమన్నారు. శ్రీకాకుళానికి మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి సిక్కోలు కార్పొరేషన్‌లో జనసేన జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా విజయం కూటమిదే" అని తెలిపారు. ఓటమి పాలైన పార్టీలు ఈవీఎంలను నిందించడం సరికాదని, ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మకంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పట్టణ ప్రజలు విశ్వాసం కనబరుస్తున్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. డాక్టర్ దానేటి శ్రీధర్‌పై సిక్కోలు ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసే కూటమి అధిష్టానం జనసేనకు టిక్కెట్ చేయించిందని వివరించారు. కూటమిలో ఏ పార్టీకి సీటు వచ్చినా అంతా సమిష్టిగా, సమన్వయంతో ముందుకు సాగుతూ తమ ఐక్యతను చాటుకుంటూ కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కులం, మతం, పార్టీ, రంగు చూడని ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం శ్రీకాకుళం హయాతినగరం, సీపన్నాయుడుపేట, పెద్దరెల్లివీధి తదితర ప్రాంతాల నుంచి సుమారు 350 మందికి పైగా ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వంశీకృష్ణయాదవ్, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, జనసేన మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణిలో పార్టీ కండువాలను వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ తన సతీమణి రాధారాణి మేయర్‌గా గెలిచిన 100 రోజుల్లోనే చేపట్టబోయే ప్రణాళికల గురించి ప్రజలకు వివరించారు. తన ఓటు వేయండి... మీ సమస్యలపై ప్రశ్నించండంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డవలప్‌మెంట్ డైరక్టర్ గేదెల చైతన్య, జనసేన నాయకులు గురుప్రసాద్, ఉదయ్,ప్రదీప్,నవీన్, కొండ్రు వరప్రసాద్, కామేష్, శంకర్, గంగరాజుతో పాటు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.