ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.
**కళ్యాణదుర్గం:** ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కళ్యాణదుర్గం రూరల్ సీఐ గంగాధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజలను ఉద్దేశించి ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఇతరుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, వ్యక్తిగత కక్షలు, వర్గపోరు వంటి అంశాలకు తావివ్వకూడదన్నారు. చిన్నపాటి వివాదాలను కూడా పెద్దవిగా మార్చకుండా సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఎవరైనా గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అవాంఛనీయ సంఘటనలకు కారణమైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇతరులను రెచ్చగొట్టడం, బెదిరించడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. ప్రజలు పరస్పర సోదరభావంతో వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించి, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయాలని రూరల్ సీఐ గంగాధర్ ఆకాంక్షించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని విధాలా చర్యలు చేపడుతోందని, ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.