"విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక....
విజయనగరం బ్యూరో, సూర్య : రాజకీయమంటే పోరాటం... రాజకీయం అంటే ఎత్తుకు పై ఎత్తులు.... రాజకీయంలో హత్యలుండవు గాని.... అన్ని ఆత్మహత్యలే.... అంటారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. ఇలాంటి నూతన పోకడలున్న రాజకీయాలలో పైకి రాణించాలన్నా... నాయకుడిగా ఎదగాలన్నా జీవితంలో ఎన్నో మజలీలు దాటుకుని రావాలి. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కోవాలి. మరెన్నో అవమానాలనూ భరించాలి. అవన్నీ ఎంతో మనోధైర్యంతో ఎదురొడ్డి నిలుచున్నారు కాబట్టే అవనాపు విజయ్ అనుకున్నది సాధించారు. ఆయన భార్యను విజయనగరం మేయర్ గా నిలబెట్టారు. విజయ్ కు పార్టీ టికెట్ ఇస్తే తాను రాజీనామా చేస్తానన్న అసాములున్న ఈ రోజుల్లో విజయ్ కు టికెట్ ఇవ్వకపోతే తాను రాజీనామా చేస్తానని అధినాయకత్వానికి ఎదురెళ్లి నిలబడిన అదితి గజపతిరాజు మనోధైర్యానికి, ఆమె చేసిన సాహసానికి విజయనగర ప్రజలు పట్టం కట్టారు. ఆమె చెప్పిన అభ్యర్థినే మేయర్ గా గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా చిన్నతనంలోనే తండ్రి అవనాపు సూరిబాబు అకాల మరణంతో కొంత కుంగుబాటుకు గురైన విజయ్ తన జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగాడు. నగర ప్రథమ పౌరుసత్వానికి రాజీలేని పోరాటం చేశాడు. దశాబ్ద కాలం నిరీక్షణ అనంతరం ఆయన కల నెరవేరింది. ఈ రోజున ఆయన భార్య అవనాపు భార్గవి విజయనగరం ప్రధమ పౌరురాలిగా మరి కొద్ది రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఇదే సందర్భంలో విజయ దరహాసంతో వస్తున్న ఆమెను మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు ఎంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తన ఆనందభాష్పాలకు అవధులు లేవని అందుకు తన భర్త విజయ్ కష్టం ఒకెత్తయితే, స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు మరోకెత్తని ఆమెను తన తల్లిగా భావిస్తున్నాను ..... నిజం గెలిచింది....తన భర్త గెలిచాడు...అంటూ భావోద్వేగభరిత ప్రసంగాన్ని చేశారు. ఏది ఏమైనప్పటికీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని అందరితో మంచిగా ఉండి, నగరానికి ఉత్తమ సేవలందించి వన్నె తెస్తానన్న ఆమె చేసిన బాసలు నగర ప్రజల ఆలోచనలకు సరికొత్త భాష్యం చెప్పినట్లుగా అయింది. అవనాపు భార్గవికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం !!