రక్షణ చర్యల్లో పాల్గొన్న వారి సేవలు అభినందనీయం
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఆపద సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి విలువైన ప్రాణాలను కాపాడటంలో చూపిన చొరవ, అంకితభావం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సముద్రంలో గల్లంతైన చీరాల మండలం ఓడూరు గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు చేపట్టిన రక్షణ చర్యల్లో పాల్గొన్న మెరైన్ పోలీసు సిబ్బంది, ముత్తుకూరు మండలం మధురానగర్‌కు చెందిన మత్స్యకారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాల మేరకు బుధవారం ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ స్వప్న ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రక్షణ చర్యల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, మత్స్యకారులను అభినందించి సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పంపిన అభినందన సందేశాన్ని తహసీల్దార్ స్వప్న చదివి వినిపించారు. సముద్రంలో గల్లంతైన ఐదుగురు మత్స్యకారులను సురక్షితంగా రక్షించడంలో సమయస్ఫూర్తితో, ధైర్యసాహసాలతో, సమన్వయంతో పనిచేసిన పోలీసు సిబ్బంది, మత్స్యకారుల సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ తన సందేశంలో పేర్కొన్నారు. ఆపద సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి విలువైన ప్రాణాలను కాపాడటంలో వారు చూపిన చొరవ, అంకితభావం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని అభినందించడం, ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొంటూ, రక్షణ చర్యల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సన్మాన కార్యక్రమం అనంతరం రక్షించబడిన ఐదుగురు మత్స్యకారులను వారి కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.