కావలిలో వీధి ఆవుల స్వైరవిహారం తక్షణమే కట్టడి చేయాలి
కావలి, మేజర్ న్యూస్ : కావలి పట్టణంలో ఏళ్ల తరబడి వీధి ఆవుల బెడదతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని టీడీపీ 12వ వార్డు(పాత30 వ వార్డ్)ఇన్‌ఛార్జ్ గాదంశెట్టి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై తిరుగుతున్న పశువులను తక్షణమే నియంత్రించి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గాదం శెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ... గత ఐదేళ్లుగా కావలి పట్టణంలో వీధి ఆవుల స్వైరవిహారం మితిమీరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో సరుకులు, కూరగాయల కొనుగోలుకు వచ్చే వినియోగదారులపై ఆవులు దాడి చేస్తూ, వస్తువులను లాక్కుంటూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.ఇటీవల ఆర్యవైశ్య ప్రముఖుడు, వృద్ధుడైన నేరేళ్ళ మస్తానయ్య గారిపై ఓ ఆవు దాడి చేసి తీవ్రంగా కుమ్మడంతో, ఆయన ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమనిగుర్తుచేశారు. ఇలాంటి ఘోర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మున్సిపల్ యంత్రాంగం వెంటనే మేల్కోవాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు:
రోడ్లపై తిరుగుతున్న ఆవుల యజమానులను వెంటనే గుర్తించి కఠిన హెచ్చరికలు జారీ చేయాలి; నిర్లక్ష్యంగా వ్యవహరించే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పట్టణ ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాల్లో తిరిగే పశువులను వెంటనే తరలించి గోశాలలకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
ప్రజలు, పాదచారులు భయం లేకుండా మార్కెట్లలో తిరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి.ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని, అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి ఆందోళన బాట పడతామని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి ఆవుల యజమానులకు నోటీసులు పంపించి, గోవులు రోడ్లపై తిరగకుండా నియంత్రణ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు 12వవార్డ్ టిడిపి ఇంచార్జ్ గాధంశెట్టి వేణుగోపాల్, అనుమల శెట్టి శివ,డా. పాదర్తి నాగరాజు, ఏల్చూరు రవి, పెసల పవన్ కుమార్, గొల్ల పాపారావు, రాజా సుబ్బారావు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.