ప్రజలతో మమేకమై వార్డుల అభివృద్ధికి కృషి చేయాలి: గ్రేటర్ విశాఖవిజేతలకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మార్గనిర్దేశం
పెందుర్తి, సూర్య : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించిన జనసేన, టిడిపి కూటమి అభ్యర్థులకు జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయం పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ని విజేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయం సాధించిన జనసేన అభ్యర్థులు కోన మోహన్ కుమార్ నాయుడు (114వ వార్డు), సేనాపతి సోమశేఖర్ నాయుడు (115వ వార్డు) మరియు టిడిపి అభ్యర్థి అవగడ్డ అప్పలనాయుడు (117వ వార్డు) ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజేతలను అభినందించిన ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, మీ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కూటమి నాయకులు, కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు. తమ వార్డుల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ప్రజల ఆదరాభిమానాలను పొందాలని నిర్దేశించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ, అందరితోనూ మమేకమై కూటమి బలోపేతానికి మరింతగా కృషి చేయాలని విజేతలకు మార్గ నిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.