పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్
పాలకొండ, సూర్య : మండలంలో పరిషత్ ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. పాలకొండ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ (సామగ్రి పంపిణీ) కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రి పంపిణీ కౌంటర్లలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని భద్రంగా చేరవేసేలా రూట్ ఆఫీసర్లు, పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ , తహశీల్దార్ రాదాకృష్ణ మూర్తి,స్థానిక పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.