ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన అవనిగడ్డలో పోలింగ్ సామగ్రి పంపిణీ, ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ
అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గురువారం నిర్వహించనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తొలుత అవనిగడ్డలోని రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అవనిగడ్డ మండలంలోని 38 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ లేదా వెబ్‌క్యామ్ ద్వారా వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. జూనియర్ కళాశాలలో కోడూరు, చల్లపల్లి, నాగాయలంక మండలాలకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, స్ట్రాంగ్ రూముల భద్రత, సిబ్బందికి భోజన వసతి, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ పరిశీలనలో డీఆర్డీఏ పీడీ హరిహరినాథ్, తహసీల్దార్ అంకాలు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఎం.వనజ తదితరులు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.