ఆచార్య అందే ప్రసాద్‌కు డీన్ అకడమిక్ అఫైర్స్‌గా నియామకం…
నెల్లూరు, మేజర్ న్యూస్ : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎస్‌యూ) డీన్ అకడమిక్ అఫైర్స్‌గా విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆచార్య అందే ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ఆచార్య అందే ప్రసాద్ 2026 నవంబర్ 4వ తేదీ ఉదయం డీన్ అకడమిక్ అఫైర్స్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఆచార్య అందే ప్రసాద్ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో వివిధ కీలక పరిపాలనా, విద్యా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన విశేష అనుభవం కలిగి ఉన్నారు. గతంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్‌గా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్‌గా, ఐక్యూఏసీ డైరెక్టర్‌గా, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతిగా సేవలందించారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ (BOS) ఛైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు.
విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన సమయంలో జాతీయ సేవా పథకం (NSS) కార్యక్రమాల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన NSS జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో నాలుగు స్నాతకోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే విశ్వవిద్యాలయానికి UGC నుండి 12(B) గుర్తింపు సాధించడంలో భాగస్వామ్యమయ్యారు.
ఐక్యూఏసీ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో విశ్వవిద్యాలయం NAAC నుండి 3.23 CGPAతో A గ్రేడ్ సాధించడంలో విశేష కృషి చేశారు. ఈ గుర్తింపు విశ్వవిద్యాలయ నాణ్యతా ప్రమాణాల పెంపు దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాల పెంపు, బోధన మరియు అభ్యసన ప్రక్రియల మెరుగుదల, పరిశోధనాభివృద్ధి, అకడమిక్ కార్యకలాపాల సమర్థవంతమైన నిర్వహణలో డీన్ అకడమిక్ అఫైర్స్ కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఆచార్య అందే ప్రసాద్ తన సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత, నైపుణ్యంతో విశ్వవిద్యాలయ విద్యా, పరిశోధనా రంగాల అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. సునీత, విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య టి. వీరారెడ్డి, విశ్వవిద్యాలయ బోధన మరియు బోధనేతర సిబ్బంది ఆచార్య అందే ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.