ఇంద్రకీలాద్రిపై నవంబర్ 10 నుంచి కార్తీక మాస ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు అమ్మవారి ఆలయంతో పాటు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 9న ప్రదోష కాలంలో శ్రీ మల్లేశ్వర స్వామి, శ్రీ నటరాజ స్వామి ఆలయాల్లో ఆకాశ దీపం ఏర్పాటు చేయనున్నారు. కార్తీక మాసమంతా ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రథమ కాల అభిషేకాలు, ఉదయం 8 నుంచి 11 గంటల వరకు లక్ష్మీ గణపతి పంచాక్షరీ పఠనం, కారక పారాయణాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ద్వితీయ కాల అభిషేకాలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తృతీయ కాల అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం 3.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక బిల్వార్చనలు, లక్ష బిల్వార్చనలు, సహస్ర లింగార్చనలు, రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.
నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, సాయంత్రం 5 గంటలకు దీపోత్సవం నిర్వహిస్తారు. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.30 గంటలకు కోటి దీపోత్సవం, రాత్రి 7 గంటలకు శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహించనున్నారు.
అలాగే నవంబర్ 16, 20, 23, 24, 30 తేదీలతో పాటు డిసెంబర్ 4, 7 తేదీల్లో సాయంత్రం 3.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేక బిల్వార్చన ఆర్జిత సేవ నిర్వహించి, అనంతరం రాత్రి 7 గంటలకు అన్నసంతర్పణ ఏర్పాటు చేయనున్నారు.
ఆర్జిత సేవల రుసుములు:
- నెల రోజుల సహస్ర లింగార్చన – రూ.5,116
- ఒక రోజు ప్రత్యేక బిల్వార్చన – రూ.2,000
- నిత్య ఆర్జిత రుద్ర హోమం – రూ.1,000
- ఒక రోజు సహస్ర లింగార్చన – రూ.500
- ఊంజల్ సేవ – రూ.50
భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్తీక మాస ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో వి.కె. శీనా నాయక్ కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.