బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు
సూర్య నిజాంసాగర్- బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. ఉత్తమ మార్కులు సాధించిన, ప్రతిభావంతులైన విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే ఆశించిన విజయాలను సాధించవచ్చన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, కళాశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, బిచ్కుంద మున్సిపాలిటీ చైర్ పర్సన్ సీమ రమేష్ శెట్కార్, వైస్ చైర్మన్ భాగ్య లక్ష్మి ప్రవీణ్ కుమార్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.